Share News

రియల్టర్ల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:32 AM

మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్టర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అధికారుల అండతో ఎలాంటి అనుమతులూ లేకుండా వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

రియల్టర్ల ఇష్టారాజ్యం
సర్వే నంబరు 1751లో వేసిన అక్రమ లే అవుట్‌

అక్రమ లేఅవుట్ల చెరలో అంగళ్లు

జాతీయ రహదారే టార్గెట్‌గా వెంచర్లు

అధికారుల సాక్షిగా ప్రభుత్వ ఆదాయానికి గండి

మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్టర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అధికారుల అండతో ఎలాంటి అనుమతులూ లేకుండా వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

అన్నమయ్య, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత సమీపంలోని కురబలకోట మండలం అంగళ్లులో స్థలాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోయారు. అంగళ్లు, మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో, చేనేతనగర్‌, విశ్వం కళాశాల, కురబలకోట ఫ్లైవోవర్‌ దగ్గర్లో, ముదివేడు టోల్‌గేట్‌ చుట్టుపక్కల ఎలాంటి అనుమతులూ లేకుండా వెంచర్లు వేసి, విక్రయిస్తున్నారు. కురబలకోటలో జాతీయ రహదారికి ఆనుకునే 1055, 1056, 1751, 1750 సర్వే నంబర్లలో అనధికార వెంచర్లు వేశారు. 1751 సర్వే నంబరులో వేసిన వెంచర్‌లో రాళ్లు నాటారు. రోడ్లు కూడా వేశారు. ప్లాట్లు కూడా విక్రయిస్తున్నారు. అయితే ఈ సర్వే నంబరులో కొంత భూమిని గ్రామ పంచాయితీకి దాన విక్రయం చేశారు తప్పా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు కన్వర్షన్‌ ఛార్జీలు చెల్లించలేదు. పైగా అనుమతులు లేకపోయినా దర్జాగా రాళ్లు నాటి వెంచర్‌ వేశారు.

వెంచర్లు వేయాలంటే ఇలా చేయాలి..

పలమనేరు, కుప్పం, మదనపల్లె అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (పీకెఎం ఉడా) పరిధిలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన 18 మండలాలు ఉన్నాయి. గత వారం దీన్ని పూర్తిగా విభజిస్తూ అన్నమయ్య వుడాగా మార్చారు. దీని పరిధిలో ఎవరైనా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేయాలంటే పీకేఎం వుడా అనుమతి ఉండాలి. టెక్నికల్‌ లేఅవుట్‌ అప్రూవల్‌ ఉండాలి. గ్రామ పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తు చేస్తే 7 రోజుల్లోగా పీకేఎం వుడాకు ఫార్వర్డ్‌ చేయాలి. 30 రోజుల్లోగా పీకేఎం వుడా టెంటటేటివ్‌ లేవుట్‌ ఇస్తుంది. అప్పటి నుంచి సంవత్సరం లోపు వెంచర్‌లో 9ఎం/12ఎం డబ్య్లుబీఎం రోడ్లు, డ్రైన్స్‌, కల్వర్డు, వీధి లైట్లు, వాటర్‌లైన్లు, అవెన్యూ ప్లాంటేషన్‌ డెవలప్‌ చేయాలి. ఆ వెంచర్‌లో 10శాతం ఓపెన్‌ స్పేస్‌ పార్కు డెవలప్‌మెంట్‌ కోసం వదలాలి. వెంచర్లలో 15శాతం ప్లాట్లను పీకేఎం వుడా పేరున రిజిస్టర్‌ మార్ట్‌గేజ్‌ డీడ్‌ చేయాలి. రోడ్లు, ఓపెన్‌ స్పేస్‌ గిఫ్ట్‌డీడ్‌ స్థానికంగా గ్రామ పంచాయతీకి ఉచితంగా రిజిస్టర్‌ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఫైనల్‌ లేవుట్‌ ఎల్‌పీ నంబరు వస్తుంది. అప్పుడే అమ్మకాలు చేయాలి. చెరువులు, కాలువల దగ్గర వెంచర్‌ ఉంటే నీటి పారుదల శాఖ ద్వారా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అయితే అంగళ్లు, దాని సమీపంలో కురబలకోట గ్రామ పరిధిలో వేసిన వెంచర్లకు ఎటువంటి అనుమతులూ లేవు. అయినా జాతీయ రహదారి ఆనుకునే వెంచర్లు వేసి అమ్మకాలు చేసేస్తున్నారు.

అధికారుల అండతోనే అక్రమ లే అవుట్లు

అనుమతి లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రియల్టర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కురబలకోట మండల పరిధిలో 20 వరకు వెంచర్లు ఉన్నాయి. అందులో రెండింటికి మాత్రమే అనుమతులున్నాయి. మిగిలిన వాటికి అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు. అయినా యథేచ్ఛగా ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీని వెనుక రియల్‌ వ్యాపారుల నుంచి అధికారులకు భారీగా లంచాలు ముడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు నోటీసులు ఇచ్చామని చెప్పే అధికారులు ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని చెబుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అనధికార వెంచర్ల వల్ల ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. సాధారణంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు ప్రభుత్వానికి కన్వర్షన్‌ ఛార్జీ చెల్లించాలి. స్కైర్‌ మీటర్‌కు రూ.2 లెక్కన స్కూృటినీ ఫీజు చెల్లించాలి. డెవలప్‌మెంట్‌ ఛార్జీలను పంచాయతీ నిర్ణయిస్తుంది. ఓపెన్‌ స్పేస్‌ చార్జ్‌ 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఇవ్వలేకపోతే 7శాతం ఛార్జ్‌ కడితే రెగ్యులరైజ్‌ అవుతుంది. అనధికార లేఅవుట్ల వల్ల ప్రభుత్వం ఈ ఆదాయం కోల్పోతోంది.

నోటీసులు ఇచ్చాం..బోర్డులు ఏర్పాటు చేశాం..

అక్రమ లేఅవుట్లు వేసిన వారికి నోటీసులు ఇచ్చాం. అవి అక్రమ లేఅవుట్లుగా నిర్థా రిస్తూ బోర్డులు ఏర్పాటు చేశాం. ఇప్పటికే విషయాన్ని కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. రెండు వారాల్లోగా అనుమతులు తీసుకోకపోతే వెంచర్లను తొలగిస్తాం. - బాలమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో, కురబలకోట మండలం

Updated Date - Aug 28 , 2026 | 01:32 AM