Share News

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:11 AM

తిరుపతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నా్‌పకు గురయ్యాడు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌

తిరుపతి(నేరవిభాగం), మే 31 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నా్‌పకు గురయ్యాడు. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కడపకు చెందిన నలుగురు బలవంతంగా కారులో తీసుకెళ్లినట్లు సమాచారం. ఎస్వీయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లెకి చెందిన అన్నూరు రసూల్‌ సాహెబ్‌ (58) తిరుపతి బాలాజీ కాలనీలో నివసిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన మనోహర్‌ రెడ్డి, ఖాజాపీర్‌, సుబ్బారెడ్డి, శివకుమార్‌తో కలిసి ప్లాట్లు వేసి విక్రయించేందుకు నెల్లూరు జిల్లా నందిపాడు సమీపంలో రెడ్‌ శాండిల్‌ తోటను కొనుగోలు చేశారు. ఇందుకోసం వెచ్చించిన సుమారు రూ.4 కోట్ల చెల్లింపుల విషయంలో వీరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.. ఈ విషయమై లాయర్‌ ద్వారా మిగిలిన భాగస్వాములకు రసూల్‌ నోటీసులు కూడా పంపారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరుపతి సీతమ్మ నగర్‌లోని నందకం టీషాప్‌ వద్ద రసూల్‌ సాహెబ్‌ ఉండగా.. మనోహర్‌రెడ్డి, ఖాజాపీర్‌, సుబ్బారెడ్డి, శివకుమార్‌లు అక్కడికి వచ్చారు. డబ్బుల వ్యవహారంపై రసూల్‌ సాహెబ్‌తో కొంతసేపు మాట్లాడారు. చర్చలు తెగకపోవడంతో రసూల్‌ సాహెబ్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లారు. ఈ విషయాన్ని రసూల్‌ సాహెబ్‌ డ్రైవర్‌ అనిల్‌ వెంటనే ఆయన అన్న అన్నూరు ప్రదీ్‌పకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే టీ దుకాణం వద్దకెళ్లి విచారించాడు. అనంతరం తన తమ్ముడిని నలుగురు కిడ్నాప్‌ చేసినట్లు ఆదివారం వేకువజామున ఎస్వీయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపైనా కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి బాధితుడు, నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని సీఐ వెల్లడించారు.

Updated Date - Jun 01 , 2026 | 12:11 AM