Share News

చేతికొచ్చిన వరిపైరు నీటిపాలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:47 AM

అర్నబ్‌ తుపాను కారణంగా శనివారం రాత్రి జిల్లాలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి.కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలవాలింది. వర్షాలతో పంట మొత్తం నీళ్ల పాలయ్యిందని రైతులు దిగాలు పడుతున్నారు.

 చేతికొచ్చిన వరిపైరు నీటిపాలు
కలికిరి మండలంలో నేలకొరిగిన వరిపైరు

కలికిరి, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుపాను కారణంగా శనివారం రాత్రి జిల్లాలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయచోటి మండలంలో 90 మి.మీ, నిమ్మనపల్లెలో 76.6, కలికిరిలో 68, గాలివీడులో 66.2, వాల్మీకిపురంలో 62.4మి.మీలతోపాటు మిగిలిన మండలాల్లోనూ మంచి వర్షపాతం నమోదైంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలవాలింది. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలంలో 825 ఎకరాలు, కలకడలో 325, వాల్మీకిపురంలో 1263, గుర్రంకొండలో 640, పీలేరులో 1075, కేవీ పల్లెలో 738 ఎకరాల వంతున వరి పంట సాగయ్యింది. మొత్తం 4866 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేశారు. యూరియా కొరత, కరువు కారణంగా నీటి లభ్యత వంటి ప్రతిబంధకాలను అధిగమించి ఈ దఫా మంచి ఫలితాలు సాధించనున్నట్లు రైతులు ఆశలు పెట్టుకున్నారు. తీరా పంట చేతికొచ్చి కోతలు మొదలు పెడదామనుకే సమయానికి తుపాను కారణంగా పడిన వర్షాలతో పంట మొత్తం నీళ్ల పాలయ్యిందని రైతులు దిగాలు పడుతున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 01:47 AM