అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:53 AM
శ్రీకాకుళం నుంచీ కుప్పం దాకా ఒక ఉప్పెనలా ప్రభవించిన ప్రజా ప్రభంజనంతో రెండేళ్ళ కిందట సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రెండేళ్ళలో అభివృద్ధి పనులు జిల్లాలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని మంజూరయ్యాయి. ఇంకొన్ని ప్రతిపాదనలు అమలుకు నోచుకునే దశలో వున్నాయి. అదే సమయంలో అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు.
దీర్ఘకాలిక సమస్యలకు మాత్రం దొరకని పరిష్కారం
రెండేళ్ళ కూటమి పాలనలో మిశ్రమ ఫలితాలు
తిరుపతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నుంచీ కుప్పం దాకా ఒక ఉప్పెనలా ప్రభవించిన ప్రజా ప్రభంజనంతో రెండేళ్ళ కిందట సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రెండేళ్ళలో అభివృద్ధి పనులు జిల్లాలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని మంజూరయ్యాయి. ఇంకొన్ని ప్రతిపాదనలు అమలుకు నోచుకునే దశలో వున్నాయి. అదే సమయంలో అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు.
ఆశా కిరణం...దుగరాజపట్నం
ప్రస్తుత ప్రభుత్వం చేసిన పునర్విభజనతో జిల్లాకు దుగరాజపట్నం పోర్ట్ దక్కింది. వాకాడు, చిట్టమూరు మండలాల్లో కేంద్రప్రభుత్వం దుగరాజపట్నం పోర్ట్‌ను, అందులో భాగంగా షిప్ బిల్డింగ్ యూనిట్ మంజూరు చేసింది. రూ. 30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్నాయి. దీనికోసం 3 వేల ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ఫ తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ మండలాల పరిధిలో రౌతు సూరమాల గ్రామం కేంద్రంగా స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2627 ఎకరాల భూమి సేకరిస్తుండగా అందులో ఇప్పటికే స్కై రూట్ అనే సంస్థకు 294 ఎకరాలు, ఎథీరియల్ అనే సంస్థకు 149 ఎకరాలు చొప్పున కేటాయించింది. ఫ శ్రీసిటీ సెజ్ రెండవ దశ విస్తరణకు ప్రభుత్వం 2500 ఎకరాలు సేకరిస్తోంది. సత్యవేడు మండలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ కోసం ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. అలాగే ఏర్పేడు ఐఐటీలో రెండవ క్యాంపస్ కోసం రూ. 1200 కోట్లతో విస్తరణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.ఫఏటా జనవరిలో సూళ్ళూరుపేటలో కన్నుల పండువగా జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం 2025 జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పునరుద్ధరించింది. వరుసగా ఈ ఏడాదికూడా పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహించి ప్రజలకు అటు పర్యాటక అనుభవాన్ని, ఇటు పర్యావరణ పరిరక్షణ స్పృహనూ కలిగించింది.ఫడక్కిలి మండలంలో అల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.దీనిద్వారా 14 వేల ఎకరాలకు నేరుగానూ, చెరువుల ద్వారా మరో 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే తిరుపతి, తిరుమల తాగునీటి అవసరాలు తీర్చనుంది.ఫచంద్రగిరి మండలం నారావారిపల్లె సమీపంలోని మూలపల్లి చెరువుకు హంద్రీ-నీవా జలాలను మళ్ళించే రూ. 126 కోట్ల ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు ఈ ఏడాది జనవరి 13న పనులకు శంకుస్థాపన చేశారు.ఫ వైసీపీ హయాంలో గాడి తప్పిన టీటీడీ పరిపాలనా వ్యవహారాలను ప్రస్తుత ప్రభుత్వం గాడిన పెట్టింది. నేరుగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తరచూ టీటీడీ ఉన్నతాధికారులు, పాలకమండలితో స్వయంగా సమీక్షిస్తున్నారు. తనే స్వయంగా కీలక నిర్ణయాలు తీసుకుని మార్గదర్శనం చేస్తున్నారు. ఫ వేలాది మత్స్యకారుల జీవనోపాధిగా వున్న పులికాట్ సరస్సులో పూడిక తీసి దశాబ్దాలవుతోంది. ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాకాడు మండలం పూడిరాయిదొరువు సమీపంలోని సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తొలగించేందుకు రూ. 98 కోట్లు మంజూరు చేయించింది. తాజాగా అంచనాలు సవరించి రూ. 125 కోట్లకు పెంచింది.ఫతిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లిలో సెటిల్‌మెంట్ జరగక దశాబ్దాలుగా పేరుకున్న భూ వివాదాలకు ప్రస్తుత ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.ఫతిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద విలువైన 28 ఎకరాలను ఏపీ స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించింది. అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి గొల్లవానిగుంటలో రూ. 10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్సు, చంద్రగిరిలో రూ. 2.50 కోట్లతో నారా రామ్మూర్తినాయుడు పేరిట క్రీడా వికాస కేంద్రం ఏర్పాటయ్యాయి.
పరిష్కారానికి నోచుకోని ప్రాజెక్టులు
హంద్రీ-నీవా జలాలను కల్యాణి డ్యామ్‌కు మళ్ళించేందుకు పనులు మంజూరైనా నీళ్ళు ఎలా వస్తాయన్నది ప్రశ్నగా మారింది. కేవీపల్లి మండలం అడవిలోపల్లి రిజర్వాయర్‌కే హంద్రీ-నీవా జలాలు రాలేదు. అక్కడి నుంచే జలాలు నీవా బ్రాంచి కెనాల్ ద్వారా చిత్తూరు తరలించాలి. ఆ కెనాల్ నుంచీ దామలచెరువు వద్ద నీటిని మూలపల్లి చెరువుకు మళ్ళించాలి. అసలు పనులు పెండింగులో వుంచి మూలపల్లి చెరువు పనులకు నిధులివ్వడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. గాలేరు-నగరి రెండవ దశ పనులు దశాబ్దాలుగా పెండింగులో వున్నాయి. శేషాచల కొండల్లో టన్నెల్ తవ్వి అన్నమయ్య జిల్లా నుంచీ ఈ జిల్లాకు నీటిని తరలించే పనులు అటవీ అనుమతులు రాక ఆగిపోయాయి. దీంతో బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం, మల్లిమడుగు రిజర్వాయర్ ఆధునీకరణ పనులు ఆగిపోయాయి. తెలుగు గంగ బ్రాంచి కెనాల్స్ పనులేవీ మొదలు కాలేదు. ఎస్‌ఎస్ కెనాల్ పనులు సైతం ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.