Share News

చెలరేగుతున్న మట్టి, ఇసుక మాఫియా!

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:49 AM

కుప్పం, శాంతిపురం తహసీల్దార్లు పి.రమేష్‌ బాబు, తనూజను బదిలీ చేస్తూ ఈనెల 25వ తేదీ పొద్దుపోయాక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా స్థానాల్లో జూన్‌ నెల రెండో వారంలో బాధ్యతలు స్వీకరించిన

చెలరేగుతున్న   మట్టి, ఇసుక మాఫియా!
దాసేగానూరు బయ్యానూరు చెరువులో బారులుతీరిన మట్టి ట్రాక్టర్లు

అడ్డుపడుతున్న అధికారుల కట్టడికి యత్నం

టీడీపీలోని ఒక వర్గం ద్వారా సీఎం చంద్రబాబుకు తప్పుడు ఫిర్యాదులు

బెడిసికొట్టిన తహసీల్దారు బదిలీ యత్నాలు

కుప్పం నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మూడునాలుగు వర్గాలుగా చీలిపోయిన అధికార పార్టీలోని ఓ వర్గం అండతో.. ఏకంగా తమకు అడ్డుపడుతున్న అధికారుల కట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కుప్పం తహసీల్దారు రమేష్‌ బాబును బదిలీ చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

కుప్పం, శాంతిపురం తహసీల్దార్లు పి.రమేష్‌ బాబు, తనూజను బదిలీ చేస్తూ ఈనెల 25వ తేదీ పొద్దుపోయాక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా స్థానాల్లో జూన్‌ నెల రెండో వారంలో బాధ్యతలు స్వీకరించిన భార్యాభర్తలైన ఈ ఇద్దరి ఆకస్మిక బదిలీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకు రెండుమూడు రోజుల ముందు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, కుప్పం మున్సిపల్‌ టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ కావడం చర్చకు వచ్చింది. వారిలో ఒకరిద్దరు చేసిన ఫిర్యాదువల్లే వీరి బదిలీ జరిగిందన్న ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా కుప్పం తహసీల్దారును లూప్‌లైన్‌లో కలెక్టరేట్‌ అడ్మిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇటు రెవెన్యూ, అటు అధికార టీడీపీలోనూ దీనిపై కలకలం రేగింది. ఈ బదిలీలు మట్టి, ఇసుక మాఫియా బలానికి తాజా నిదర్శమన్న వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. కిందిస్థాయి నాయకులనుంచి ఆ మాఫియాకు వత్తాసు అందుతున్నదన్న ప్రచారమూ జోరందుకుంది.

ఇంతకీ ఏం జరిగింది?

కుప్పం నియోజకవర్గంలో రెండు మూడు నెలలుగా మట్టి, ఇసుక మాఫియా దందాలు ఎక్కువయ్యాయి. క్షేత్రస్థాయి నాయకుల సహకారంతో చెలరేగిపోయాయి. ఈ క్రమంలో జూన్‌ నెల రెండో వారంలో కుప్పం తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన రమే్‌షబాబు అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించారు.

- కుప్పం పురపాలక సంఘ పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలపై దాడులు జరిపారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలుతున్న మట్టి టిప్పర్లను అడ్డుకుని జరిమానా వేశారు. ఆ క్రమంలో తనను బెదిరించిన కొందరిపై పోలీసులకూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

- కుప్పం మండలం గుండ్లబడుగు చెరువులో ఫిల్టర్‌ ఇసుక దందాపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఫిల్టర్‌ ఇసుకతో తమిళనాడుకు తరలుతున్న టిప్పర్లను అడ్డుకుని సుమారు రూ.25 వేల జరిమానా విధించారు.

- మల్లానూరులో ఓ ప్రైవేటు స్కూల్‌ భవనంకోసం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినీ ఆక్రమిస్తుంటే తహసీల్దారు రమే్‌షబాబు అడ్డుకున్నారు. భారీ స్థాయిలోనే అక్రమార్కులకు జరిమానా విధించినట్లు సమాచారం.

- మండలంలోని చెరువుల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇవన్నీ ఇసుక, మట్టి మాఫియాకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే టీడీపీలోని కొంతమంది ద్వారా సీఎంకు తప్పుడు ఫిర్యాదులు చేసి.. బదిలీ చేయించారన్న ప్రచారం జరుగుతోంది.

సీఎం దృష్టికి వాస్తవాలు

కుప్పం తహసీల్దారు రమే్‌షబాబు ఆకస్మిక బదిలీ అధికార.. ఉద్యోగ వర్గాల్లో విస్మయం కలిగించింది. వీఆర్వోల బదిలీలూ తప్పవన్న ప్రచారం వారిలో మరింత ఆందోళన కలిగించింది. ఈ బదిలీ విషయంలో.. ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని భావించిన టీడీపీలోని మరికొందరు అప్రమత్తమయ్యారు. మరోవైపు రెవెన్యూ ఉద్యోగుల్లో అధిక శాతం మంది స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్లి రమేష్‌ బాబు బదిలీని ఆపించాలని కోరారు. ఆయన బదిలీపట్ల కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా అంత సంతృప్తిగా లేరని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీలోని ఓ వర్గం చురుగ్గా వ్యవహరించి.. సీఎం చంద్రబాబుకు వాస్తవాలు చేరవేసింది. దీంతో రమే్‌షబాబు బదిలీ రద్దయి.. ఆయన తిరిగి కుప్పం తహసీల్దారుగా నియమితులయ్యారు.

నిరాశలోకి మాఫియా

ఈ బదిలీ ద్వారా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న మట్టి, ఇసుక మాఫియా తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తమకు అడ్డుగా ఉన్న మరికొందరు అధికారుల బదిలీలూ చేయించాలన్న వారి ప్రయత్నాలకు గండిపడింది. వారికి అండగా ఉంటున్న కొన్ని రాజకీయ వర్గాలు ప్రస్తుతానికి తెర వెనక్కు వెళ్లిపోవాల్సిన అగత్యం దాపురించింది.

‘పొలిటికల్‌ గవర్నెన్స్‌’ పాటిస్తేనే..

ఇక, తహసీల్దారు రమే్‌షబాబు తన వ్యవహార శైలినీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రజాప్రతినిధులు, లేదా ఒక స్థాయి నేతలు కార్యాలయానికి వెళ్లినప్పుడు అంటీముట్టనట్లు వ్యవహరిస్తారన్నది వారి ఫిర్యాదు. సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్న పొలిటికల్‌ గవర్నెన్స్‌ పాలనా పద్ధతికి ఈ తీరు భిన్నమైనది. ఇలాంటప్పుడే తప్పుడు ఫిర్యాదులనూ ఉన్నతస్థానంలో ఉన్నవారు కూడా నమ్మాల్సి వస్తుందని కుప్పం తహసీల్దారు ఉదంతం చెబుతున్న పాఠం. ఇకనైనా ఆయన పొలిటికల్‌ గవర్నెన్స్‌ పాటించేలా తన విధానం మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:49 AM