Share News

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:26 AM

గంగవరం నుంచి కర్ణాటకకు యథేచ్ఛగా అక్రమ రవాణా పోలీసు స్టేషన్‌, తహసీల్దారు కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే డంపింగులు అయినా పట్టించుకునే వారే లేరు

రెచ్చిపోతున్న ఇసుకాసురులు
అక్రమార్కులు నిల్వ ఉంచిన ఇసుక డంపింగ్‌

గంగవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చీకటి పడితే చాలు యంత్రాలతో కౌండిన్య నదీ కాలువలో ఇసుక తవ్వేస్తున్నారు. ఉదయానికి డంపింగు చేసి.. సాయంత్రానికి కర్ణాటకకు తరలించేస్తున్నారు. ఇదంతా బహిరంగమే అయినా.. తమకు తెలియనట్లుగా సంబంధిత అధికారులు ఉంటున్నారు.

గంగవరం, కూర్నిపల్లె, కొత్తిండ్లు, జీడిమాకులపల్లె, క్యాటిల్‌ఫామ్‌ ప్రాంతాలలోని కౌండిన్య నదీకాలువలో విస్తారంగా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడి ఇసుకకు కర్ణాటకలో డిమాండు ఎక్కువ. అందుకని గంగవరంలోని కొంతమంది అధికారపార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు రింగుగా ఏర్పడ్డారు. సాయంత్రం 7 గంటలకే హిటాచీలు, ఎక్స్‌కవేటర్లను కౌండిన్య నదీ కాలువలోకి దించేస్తారు. రాత్రంతా ఇసుక తవ్వుతారు. నీటిలో ఉన్న ఇసుకనూ వదలరు. నీటిలో ఉన్న తేమ ఇసుకను తవ్వి.. ఒడ్డున వేసి ఆరబెడతారు. అర్ధరాత్రికి ఇళ్లకు తిరిగి వచ్చేస్తారు. ఉదయానికల్లా ఇసుకలో నీళ్లు ఒడిగిపోతాయి. ఆ ఇసుకను మధ్యాహ్నం వరకు ట్రాక్టర్లతో సమీపంలోని.. తమకు అనువైన మామిడితోపులు, ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్‌కు చేస్తారు. సాయంత్రం ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఆ ఇసుకను టిప్పర్లకు లోడ్‌ చేస్తారు. కూర్నిపల్లె రోడ్డుగుండా వచ్చి గంగవరం ఫ్లైఓవర్‌ మీదుగా జాతీయ రహదారిపై దర్జాగా కర్ణాటకకు తరలించేస్తున్నారు.

కార్యాలయాలకు సమీపానే డంపింగ్‌

గంగవరం పోలీసు స్టేషన్‌, తహసీల్దారు కార్యాలయాలకు కూతవేటు దూరంలో పట్టపగలే ఇసుక డంపింగ్‌లకు ట్రాక్టర్‌లతో తరలించి భారీగా నిల్వ ఉంచుతున్నారు. కానీ, ఈ ఇసుక నిల్వలు సంబంధిత అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. కొందరు నేతల ఒత్తిడి, ఇసుకాసురులతో ‘ఒప్పందం’తోనే డంపింగ్‌ల వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. నదీ కాలువలో యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని స్థానికులు సమాచారమిచ్చినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి.

టిప్పరు రూ.30 వేలు!

కౌండిన్య ఇసుకకు బెంగళూరులో డిమాండు ఉంది. ఒక టిప్పర్‌ ఇసుక ధర రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు దీనినే ఆదాయ వనరుగా ఎంచుకొన్నారు. ప్రతిరోజూ కర్ణాటకకు ఇసుక తరలిస్తున్నారు. దీంతో వచ్చే డబ్బుతో కొందరికి మద్యం ఇచ్చి, విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఇసుక అక్రమరవాణాకు కాపలాగా వాడుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Sep 28 , 2026 | 01:26 AM