విజృంభిస్తున్న జ్వరాలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:01 AM
చిత్తూరు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు కూడా నమోదవుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దోమల బెడద, పారిశుధ్య లోపం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన గణాంకాలు.. జిల్లాలో జ్వర తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
145 మందికి డెంగ్యూ, ఐదుగురికి మలేరియా
చిత్తూరు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు కూడా నమోదవుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దోమల బెడద, పారిశుధ్య లోపం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన గణాంకాలు.. జిల్లాలో జ్వర తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
- చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి
జిల్లాలో ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 11వ తేది వరకు 64 వైద్య కేంద్రాల పరిధిలో ఏకంగా 32,124 జ్వరాల కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 145 డెంగ్యూ, ఐదు మలేరియా కేసులు గుర్తించారు. జ్వరాల నమోదులో శాంతిపురం వైద్య కేంద్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 1676 జ్వర కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా ఆస్పత్రి పరిధిలో 1538, గంగవరంలో 1438, వి.కోటలో 1231, తవణంపల్లెలో 1438, విజయపురంలో 1231, యాదమరిలో 1115, పెనుమూరులో 1008 కేసులు నమోదయ్యాయి. అలాగే నాగరి, ఇరాల, తాళపులనేరివారిపల్లె, సత్యనారాయణపురం, పులిచెర్ల తదితర ప్రాంతాల్లోనూ వందల సంఖ్యలో జ్వర బాధితులు వైద్య సేవలు పొందారు. జిల్లాలోని అనేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జ్వరాల ప్రభావం విస్తృతంగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అత్యల్పంగా గుడుపల్లెలో ఆరు కేసులు
గుడుపల్లె వైద్య కేంద్రం పరిధిలో కేవలం ఆరు జ్వర కేసులు నమోదయ్యాయి. రామకుప్పంలో 17, కొలమాసనపల్లిలో 18, సాతరవాడ యూపీహెచ్సీ పరిధిలో 18, కుప్పం ఏరియా ఆస్పత్రి పరిధిలో 30 కేసులు నమోదయ్యాయి. పైపాలెం, బంగారుపాళ్యం సీహెచ్సీ పరిధుల్లో 32 చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా, అత్యల్పంగా నమోదైన కేసుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో జ్వరాల నమోదు తక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటి? అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లో వ్యాప్తికి దారితీసిన పరిస్థితులేమిటి? అన్న అంశాలపై సమగ్ర విశ్లేషణ జరగాల్సి ఉంది.
డెంగ్యూ కలవరం.. నివారణ చర్యలేవీ?
జిల్లావ్యాప్తంగా 145 డెంగ్యూ కేసులు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జీడీనెల్లూరు, తుంబకుప్పం ప్రాంతాల్లో తొమ్మిది చొప్పున, అరిమాకులపల్లిలో ఎనిమిది, తాళపులనేరివారిపల్లెలో ఏడు, తవణంపల్లె, పెనుమూరు, గుడిపాల ప్రాంతాల్లో ఆరు చొప్పున కేసులు నమోదయ్యాయి. బొమ్మసముద్రం, యాదమరి, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లోనూ డెంగ్యూ బాధితులను గుర్తించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, దోమల లార్వా వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి నిర్మూలించాల్సి ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది.
గతం కంటే తగ్గాయి
గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది డెంగ్యూ కేసులు తగ్గాయి. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వేలు నిర్వహించి వైద్యం అందిస్తున్నాం. జ్వరాల శాతాన్ని ఇంకా తగ్గించే చర్యలు చేపడతాం. మలేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
- నాగ శశిభూషణ్రెడ్డి, డీఎంహెచ్వో