యథేచ్ఛగా భూముల ఆక్రమణ
ABN , Publish Date - Jul 27 , 2026 | 02:07 AM
మదనపల్లె పట్టణ శివారులో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. బండలు, గుట్టలను సైతం ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే వేసిన హౌసింగ్ లేఅవుట్లను ఆనుకుని విలువైన ఖాళీ స్థలాలను చదును చేసి, పునాదులు నిర్మిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా క్షేత్రస్థాయిలో వీఆర్వోలను మ్యానేజ్ చేయడంతో మిన్నకుండిపోతున్నారు.
ఖాళీ స్థలాలపై అక్రమార్కుల కన్ను
రెవెన్యూ అండదండలతో నిర్మాణాలు
మదనపల్లె పట్టణ శివారులో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. బండలు, గుట్టలను సైతం ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే వేసిన హౌసింగ్ లేఅవుట్లను ఆనుకుని విలువైన ఖాళీ స్థలాలను చదును చేసి, పునాదులు నిర్మిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా క్షేత్రస్థాయిలో వీఆర్వోలను మ్యానేజ్ చేయడంతో మిన్నకుండిపోతున్నారు.
మదనపల్లె, జూలై 22(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణానికి ఆనుకుని ఉన్న బి.కె.పల్లె, కోళ్లబైలు, వెంకప్పకోట, బసినికొండ, వలసపల్లె తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, విలువైన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ముఖ్యంగా బసినికొండ, వెంకప్పకోట, కోళ్లబైలు, బి.కె.పల్లె రెవెన్యూ గ్రామాల్లో గుట్టలను ఎంచుకుంటున్నారు. ఇవన్నీ పట్టణానికి అతి సమీపంలోనే ఉండటంతో అక్రమార్కులు దృష్టి పెట్టారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాల్లోనే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి పేదలకు స్థలాలు కేటాయించారు. ఇలా 2006 నుంచి నిన్నటి వైసీపీ ప్రభుత్వంలోని 2023 వరకూ ప్లాట్లు ఇచ్చారు. వీటికి ఆనుకుని ఉన్న, కమ్యూనిటీ అవసరాలకు కేటాయించిన స్థలాలనూ వదలడం లేదు. ముఖ్యంగా స్థానిక బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వెంకప్పకోట రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్ 81, 82లలో గత ప్రభుత్వాలు విడతల వారీగా పేదలకు ప్లాట్లు కేటాయించారు.
యథేచ్ఛగా విక్రయాలు
నాటి ఇందిరమ్మ పథకం నుంచి నిన్నటి జగనన్న పథకం వరకూ ఆయా లేఅవుట్లలో ప్లాట్లు పోను ఇంకా కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కేటాయింపు స్థలాల్లో నిర్మించిన పునాదులు, గోడలను సైతం ధ్వంసం చేసి, అమ్మకాలు చేపడుతున్నారు. వీటితోపాటు సమీపంలోని గుట్టను చదును చేసి, బండలను కొట్టేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. పాత పట్టాల పేరుతో కొందరు, నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో మరికొందరు ఆక్రమణ, కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయిలో వీఆర్వోలకు తెలిసినా, స్థానికులు ఫిర్యాదు చేసినా పైసలు తీసుకుని పనులు కానిచ్చేస్తున్నట్లు చెబుతున్నారు.
నకిలీ పట్టాలతో ఆక్రమణ
వెంకప్పకోటలోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న గుట్టలో నకిలీ పట్టాలు, బోగస్ మిలటరీ పట్టాలతో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే రాళ్లు, బండలను తొలగించి చదును చేయగా, అంచెలంచెలుగా ఆక్రమించేస్తున్నారు. ఇదిలా ఉండగా, పేదలకు ఇచ్చిన అసైన్‌మెంట్ పట్టాలను పేదల ఇంటి నిర్మాణం పేరుతో రెవెన్యూ అధికారులు స్వాధీనానికి నోటీసులు జారీ చేస్తున్నారు. తర్వాత బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే వీటిపై పెట్టే శ్రద్ధ రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై పెట్టి అడ్డుకోలేకపోతున్నారు. వారంతా యథేచ్ఛగా ప్రభుత్వ భూములు, స్థలాల్లో పాగా వేసి అయిన కాడికి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నా చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది ఒక వెంకటప్పకోటలోనే కాదు బసినికొండ, బి.కె.పల్లె, కోళ్లబైలు రెవెన్యూ గ్రామాల్లో ఇదే పరిస్థితి. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలే కాదు గుట్టుచప్పుడు కాకుండా గుట్టలు కూడా మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.