పంటలపై కొనసాగుతున్న గజ దాడులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:29 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
కల్లూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ విభాగ అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక సమీపంలో వారం రోజులుగా తిష్ఠ వేసిన ఏనుగుల మంద రాత్రి వేళలో మండలంలోని పొలాల్లోకి చేరుకుని బీభత్సం సృష్టిస్తున్నాయి. కల్లూరు, పాతపేట పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి పంటలపై 12 ఏనుగుల మంద దాడి చేయడంతో అపారనష్టం వాటిల్లింది. గోగులమ్మ వంక సమీపం నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన మంద కల్లూరు- గంటావారిపల్లె రోడ్డును దాటుకొని కల్లూరు సమీపానికి చేరుకున్నాయి. కల్లూరుకి చెందిన రైతులు టీఎస్ ఖాదర్‌బాషా, మున్నీ మామిడి తోటలోకి చేరుకుని 20 ఏళ్ల చెట్లను ధ్వంసం చేశాయి. కొమ్మలుసహా కొన్ని చెట్ల మొదళ్ల వరకు విరిచేశాయి. గేట్ వాల్వులను ధ్వంసం చేసి, పైపులను తొక్కేశాయి. రాత్రంతా మామిడితోటలోనే తిష్ఠవేసి బీభత్సం సృష్టించాయి. అక్కడినుంచి వచ్చిన మార్గంలోనే తిరిగి అడవిలోకి చేరుకున్నాయి. శనివారం పగలంతా గోగులమ్మ వంక సమీపంలో సంచరించాయి. ఉదయం మామిడితోటల వద్దకు వెళ్లిన రైతులు ఏనుగుల దాడిలో ధ్వంసమైన చెట్లను చూసి లబోదిబోమన్నారు.