రమణుడు పిలిచేను..
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:37 AM
తన అద్భుత స్వరంతో గానలహరిలో శ్రోతలను ఓలలాడించిన సినీ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారనే వార్త ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను శోకసముద్రంలో ముంచివేసింది. తమ జిల్లాతో మహాగాయనికి ఉన్న అనుబంధాన్ని వారు ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. శ్రీవారి పట్ల ఆమెకు మెండైన భక్తిభావం. ఈ క్రమంలోనే పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కోసం ఆమె ఆలపించిన రమణుడు పిలిచేను రావే..., నారాయణా నీ నామమే గతిమాకు..’’వంటి అన్నమయ్య కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ ఆమెకు స్వయాన సోదరి కుమారుడు.
శ్రీవారికి గానామృతంతో జానకి అర్చన
అన్నమాచార్య ప్రాజెక్టుతో అనుబంధం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు)/తిరుపతి సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తన అద్భుత స్వరంతో గానలహరిలో శ్రోతలను ఓలలాడించిన సినీ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారనే వార్త ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను శోకసముద్రంలో ముంచివేసింది. తమ జిల్లాతో మహాగాయనికి ఉన్న అనుబంధాన్ని వారు ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. శ్రీవారి పట్ల ఆమెకు మెండైన భక్తిభావం. ఈ క్రమంలోనే పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కోసం ఆమె ఆలపించిన రమణుడు పిలిచేను రావే..., నారాయణా నీ నామమే గతిమాకు..’’వంటి అన్నమయ్య కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ ఆమెకు స్వయాన సోదరి కుమారుడు. టీటీడీ విడుదల చేసిన శ్రీకృష్ణతత్వం క్యాసెట్ కోసం గరిమెళ్ల స్వరపరిచిన అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాల కోసం పలుమార్లు తిరుపతికి వచ్చారు. మహతిలో నిర్వహించిన సంగీత కచేరీలో పాల్గొన్నారు. 2012లో గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ నివాసంలో బాత్‌రూమ్‌లో జారిపడి గాయపడ్డ ఎస్.జానకి స్విమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు.
చిత్తూరు వాతావరణం ఎంతో హాయి
చిత్తూరు కల్చరల్: చిత్తూరు జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని జానకి చెప్పేవారు. చిత్తూరు వచ్చిన సందర్భాల్లో ఆమె ఈ మాటలనేవారు. 1998లో ఆమె చిత్తూరు కల్చరల్ అకాడమీ సెక్రటరి రాజశేఖర్ నాయుడు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును నాటి కలెక్టర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2000లో కల్చరల్ అకాడమీ మిలీనియం వేడుకలో పాల్గొని తన గానామృతంతో నగరవాసులను ఉత్సాహపరిచారు. అదే వేడుకలలో గాయని సుశీలతోపాటు జమునా రాణి, రామకృష్ణ, పీబీ శ్రీనివాస్, బాలసుబ్రమణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యంలు పాలుపంచుకున్నారు. 2005 నవంబరులో రచయిత సీఎన్ చంద్రశేఖర్ రచించిన ‘ఊటిలో సాయంత్రం’ పుస్తకాష్కరణకు జానకి హాజరయ్యారు.
ముక్కంటి ఆలయ ఆస్థాన గాయనిగా..
శ్రీకాళహస్తి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ముక్కంటి ఆలయ ఆస్థాన గాయనిగా ఎస్.జానకికి గౌరవ హోదా ఉండేది. ఈక్రమంలోనే ఆమె 2005లో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ధూర్జటి కళాప్రాంగణంలో తన గానంతో భక్తులను మైమరిపించారు. అప్పటి ఆలయ, దేవదాయశాఖ అధికారులు ఆమెను శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన గాయనిగా గుర్తిపునిస్తూ సత్కరించారు. శ్రీకాళహస్తితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని కళాభిమానులు స్మరించుకుంటున్నారు.