ఊరించి ఉసూరుమనిపించి..
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:04 AM
టమోటాకు నెల రోజులుగా గిట్టుబాటు ధర లభించడం లేదు. సోమల మార్కెట్‌లో జూలై నుంచి 15 కిలోల బాక్సు నాణ్యమైన కాయలు రూ.150 మాత్రమే పలికాయి. ఈ నెల 11, 12 తేదీల్లో 15కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.300 పలికింది. 13న రూ.150కి పడిపోయింది.
- మళ్లీ తగ్గిన టమోటా ధర
సోమల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): టమోటాకు నెల రోజులుగా గిట్టుబాటు ధర లభించడం లేదు. సోమల మార్కెట్‌లో జూలై నుంచి 15 కిలోల బాక్సు నాణ్యమైన కాయలు రూ.150 మాత్రమే పలికాయి. ఈ నెల 11, 12 తేదీల్లో 15కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.300 పలికింది. 13న రూ.150కి పడిపోయింది. రెండో రకం రూ.100 నుంచి రూ.50 వరకు పలుకుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో నాటిన తోటల నుంచి ప్రస్తుతం మార్కెట్‌కు టమోటాలు వస్తున్నాయి. సోమల మండలంలోనే వెయ్యి ఎకరాల్లో సాగు ఉంది. కలకడ, మహల్, దేవపట్ల, కోన తదితర ప్రాంత రైతులు వచ్చి పంటను సాగు చేశారు. ఎకరా రూ.50 వేల వరకు రైతుల నుంచి కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఎకరా సాగుకు రూ.2లక్షలు మించి ఖర్చు పెట్టారు. కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోల బాక్సు రూ.50 లోపే పలుకుతుండటంతో కోతలు చేసినా కూలి డబ్బు కూడా రావడం లేదని తోటల్లో వదిలేస్తున్నారు. మార్కెట్‌లో బాక్సుకు 10 శాతం కమీషన్, పొలం నుంచి మార్కెట్‌కు రవాణా ఖర్చు రూ.10 నుంచి రూ.20 చెల్లించాలి. దీనికితోడు మార్కెట్‌లో బాక్సులు దించడానికి బాక్సుకు కూలి మరో రూ.2 చెల్లించాలి. ఒక్కో మనిషికి కోత కూలీ రూ.400 చెల్లించాలి. లేకపోతే ఒక్కో బాక్సు కోస్తే రూ.20 గుత్త ఒప్పందంతో కోస్తారు. బాక్సులు మోయడానికి రూ.600కు మించి చెల్లించాలి. అందుకే రైతులు పొలాల్లోనే టమోటాలను వదిలేస్తున్నారు.