మరిన్ని చిక్కుల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే
ABN , Publish Date - May 24 , 2026 | 02:18 AM
ఇప్పటికే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో వివాదంలో ఇరుక్కున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తాజాగా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు పబ్బుల్లో మహిళల గురించి, ముస్లిం మహిళల గురించే కాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు గురించి సైతం అసభ్యంగా మాట్లాడిన వీడియోలు వెలుగు చూడడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరమైన ఆయన తాజా పరిణామాలతో క్యాబినెట్ హోదా కలిగిన అసెంబ్లీ విప్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
-అదుపుతప్పిన వ్యవహార శైలితో భారీ మూల్యం
తిరుపతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో వివాదంలో ఇరుక్కున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తాజాగా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు పబ్బుల్లో మహిళల గురించి, ముస్లిం మహిళల గురించే కాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు గురించి సైతం అసభ్యంగా మాట్లాడిన వీడియోలు వెలుగు చూడడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరమైన ఆయన తాజా పరిణామాలతో క్యాబినెట్ హోదా కలిగిన అసెంబ్లీ విప్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇదివరకే ఓ మహిళా ఉద్యోగి నుంచీ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే తాజాగా అదే మహిళ విడుదల చేసిన ఇతర వీడియోలు ఆయన్ను మరిన్ని చిక్కుల్లో పడేశాయి. ఈ ఏడాది జనవరిలో రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హర్షవీణ ఎమ్మెల్యే తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సీఎంకు, డిప్యూటీ సీఎంకు కూడా ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిగా ఎమ్మెల్యే తల్లి తన కుమారుడిని వేధిస్తోందంటూ హర్షవీణపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదుపైనా కేసు నమోదైంది. ఈ కేసుల్లో అటు ఎమ్మెల్యే, ఇటు హర్షవీణ హైకోర్టు నుంచీ బెయిల్ తెచ్చుకుని అరెస్టులను తప్పించుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండాలంటూ జనసేన అధిష్ఠానం ఎమ్మెల్యేని ఆదేశించింది. ఈ వివాదంతో ఆయన నెలన్నర పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. చివరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఇటీవల జనసేన అధినేత పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశానికి వెళ్ళినా లోనికి అనుమతించలేదు.ఈ వివాదం సద్దుమణుగుతున్న తరుణంలో హర్షవీణ గురువారం మూడు వీడియోలు బయటికి వదిలారు. ఎమ్మెల్యేతో కలసి కారులో ప్రయాణిస్తున్న తరుణంలో ముస్లిం మహిళల గురించి, బెంగుళూరు పబ్బుల్లో మహిళల గురించి, ఆపై సీఎం చంద్రబాబు గురించి కూడా అసభ్యకరమైన కామెంట్లు చేసిన వీడియోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో అవన్నీ వైరల్ అయ్యాయి.ముస్లిం మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం పట్ల ఆ వర్గాల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.మరోవైపు సీఎం చంద్రబాబు గురించి అసభ్యంగా మాట్లాడినట్టు తెలియడంతో టీడీపీ వర్గాలు సైతం మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే తీరు పార్టీకి తలవంపులు తెస్తోందంటూ జనసేన శ్రేణులు తీవ్రంగా మధనపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ శనివారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలసి అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు.ఇపుడున్న రాజకీయాల్లో ఆధిపత్య కులాలకు చెందిన బలమైన వ్యక్తులు కూడా నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. అలాంటిది పార్టీల ప్రభంజనంలో సునాయాసంగా గెలుపు సాధించిన శ్రీధర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జాతి సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి వివాదాల్లో చిక్కుకుని రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకునే పరిస్థితిని చేజేతులారా తెచ్చుకోవడం దళిత సామాజికవర్గాలకు కూడా మింగుడు పడడం లేదు.