రైల్వే కోడూరుకు గాలేరు-నగరి జలాలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:23 AM
రైల్వే కోడూరుకు గాలేరు-నగరి జలాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
తిరుపతి/రైల్వేకోడూరు/ఓబులవారిపల్లె, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రైల్వే కోడూరుకు గాలేరు-నగరి జలాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లె సమీపంలో వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ఇక్కడి ప్రజలు తనపైన, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైన ప్రత్యేక అభిమానం చూపుతున్నారన్నారు. తమ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని స్థానికులు అడగ్గానే, చేర్చామన్నారు. బెరైటీ్‌సకు కేంద్రంగా గుర్తింపు పొందిన మంగంపేట ప్రాంతం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించిన చరిత్రనూ సొంతం చేసుకుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి కోరిన పనులన్నీ మంజూరు చేస్తామన్నారు. రూ.5-6 కోట్లతో కోడూరులో ఆర్టీసీ బస్‌స్టేషన్ మంజూరు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ద్వారా రూ.8 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏపీఎండీసీ ద్వారా చిట్వేలి మండలంలో రూ.10 కోట్లతో పాఠశాల మంజూరు చేయిస్తున్నామన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న 22 కిలోమీటర్ల కోడూరు- వెంకటగిరి రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తెప్పించి పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి సేకరిస్తాం
గోవిందా..గోవిందా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఇక్కడ గాలి సైతం నమో వేంకటేశ్వర అని నినదిస్తుందని, పూలు సైతం ఆయన నామస్మరణ చేస్తాయన్నారు. అలాంటి పవిత్ర తిరుపతి జిల్లా పరిధిలోని ముక్కావారిపల్లిలో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి నుంచి సభా ప్రాంగణానికి వస్తుంటే మామిడి చెట్లు కనిపించాయని, ఇక్కడి రైతుల కష్టాలను ముఖ్యమంత్రి తనకు వివరించారన్నారు అందువల్లే మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని సేకరించేందుకు ముందుకు వచ్చామన్నారు.
ఇక్కడి యువతతో మాట్లాడతా
ఎన్నికల తర్వాత తాను రెండు మూడుసార్లు ఇక్కడికి వచ్చానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. యువతకు ఉపాధిపై రూపానందరెడ్డి చెప్పింది పరిగణనలో ఉందన్నారు. భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి యువతతో మాట్లాడతానన్నారు.
పోటెత్తిన జనం
బహిరంగసభకు అంచనాలకు మించి జనం పోటెత్తారు. టీడీపీకి బలం కలిగిన నియోజకవర్గం కావడంతో పాటు అక్కడ పవన్ కల్యాణ్‌కూ భారీగా అభిమానులున్న సంగతి తెలిసిందే. దీంతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాకముందే జనంతో ప్రాంగణం నిండిపోయింది. చంద్రబాబు, పవన్ పేర్లు వినిపించిన ప్రతిసారీ జనం నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. వీరి ప్రసంగ సమయంలోనూ అదే స్పందన కనిపించింది. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారని, తనకు మంచి మిత్రుడని చంద్రబాబు ప్రశంసించారు. సభ సూపర్ సక్సెస్ కావడం, జనం నుంచీ అనూహ్య స్పందన కనిపించడంతో వీరిద్దరూ సంతృప్తిగా ఉన్నట్టు కనిపించింది. కాగా, వీబీ జీ రామ్‌జీ పథకానికి సంబంధించి ఫారంపాండ్, మొక్కలు నాటడం, మ్యాజిక్‌డ్రైన్ కార్యక్రమాలను ప్రారంభించారు. గత రెండేళ్లలో జరిగిన ఉపాధిహామీ పనులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. శ్రామికులకు జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ పరిశీలకులు దామచర్ల సత్య, పెందుర్తి వెంకటేష్, ఐఏఎస్ అధికారులు రోహిణికాన్సాల్, కృష్ణతేజ, కాంతీలాల్‌దండే, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.