Share News

వైసీపీ నేత ఇళ్లల్లో సోదాలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:30 AM

పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన వైసీపీ నాయకురాలు కోనేటి సులోచన ఇళ్లల్లో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వైసీపీ నేత ఇళ్లల్లో సోదాలు
డాక్యుమెంట్‌ పరిశీలిస్తున్న పోలీస్‌ అధికారి

ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర పత్రాల స్వాధీనం

అక్రమ రిజిస్ర్టేషన్‌ కేసులపై సోదాలు: డీఎస్పీ

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన వైసీపీ నాయకురాలు కోనేటి సులోచన ఇళ్లల్లో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్నింటిని సీజ్‌ చేయగా, మిగతా వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. న్యాయస్థానం, ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు చేసినట్లు డీఎస్పీ బుచ్చిరాజు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..నీరుగట్టువారిపల్లెకు చెందిన సులోచన గతంలో పట్టణానికి చెందిన మార్పూరి వెంకటే్‌షనాయుడుకు చెందిన భూములను ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్స్‌ సృష్టించి తన పేరు మీద రిజిస్ర్టేషన్‌ చేసుకుంది. మదనపల్లె మండలం పొన్నూటిపాళెంలో 1.75ఎకరాలు, కదిరిరోడ్డులో 4.5కుంటల్లో నిర్మించిన కాంప్లెక్స్‌, టమోటా మార్కెట్‌యార్డు సమీపంలో 1.35ఎకరాలు, కురవంకలో ఉన్న భూములను తప్పుడు డాక్యుమెంట్స్‌తో రిజిస్ర్టేషన్‌ చేసుకుందని వెంకటే్‌షనాయుడు పేర్కొంటూ 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు విచారణ చేసి సులోచనపై మూడు చీటింగ్‌ కేసులు నమోదు చేశారు. భూములు రిజిస్ర్టేషన్‌ చేసిన పలువురి రిజిస్ర్టార్లు, కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్స్‌, ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.

న్యాయస్థానం ఆదేశాలతో దాడులు

చీటింగ్‌ కేసులపై పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక పంపాలని న్యాయస్థానం ఇటీవల ఎస్పీని ఆదేశించింది. ఈక్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో వన్‌టౌన్‌, టూటౌన్‌, క్రైమ్‌ సీఐలు రాజారెడ్డి, మహ్మద్‌రఫీ, మోహన్‌కుమార్‌ తమ సిబ్బందితో కలసి ఉదయం నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. టమోటా మార్కెట్‌యార్డు పక్కనే ఉన్న రెండు ఇళ్లు, రామిరెడ్డిలేఅవుట్‌లోని మరో ఇంట్లోకి సెర్చ్‌ వారెంట్‌తో ప్రవేశించి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బీరువాలు, కప్‌బోర్డులు, లాకర్లలో ఉన్న 50రకాల ఫోర్జరీ డాక్యుమెంట్స్‌, అగ్రిమెంట్లు, ఖాళీ బాండ్‌ పేపర్లు, ఒరిజినల్‌, నకిలీ పత్రాలు సహా ఇతర విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సులోచన తన పేరు మీద ఉన్న భూములను కొన్నింటిని తన పిల్లలు హర్షవర్ధన్‌, అనూష, తల్లి రెడ్డెమ్మ పేరు మీద బదలాయింపు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని, సుమారు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. వాటిల్లో 15డాక్యుమెంట్స్‌ను సీజ్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. సీజ్‌ చేసిన పత్రాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎ్‌ఫఎ్‌సఎల్‌)కు పంపుతున్నామన్నారు. అన్ని కోణాల్లో కేసుదర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 01:30 AM