Share News

అటు తేజోమయం.. ఇటు వరుణ కటాక్షం

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:31 AM

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్పస్వామి భక్తకోటిని కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, కర్పూర హారతులు, గోవిందనామస్మరణలతో సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతం గా సాగింది.

అటు తేజోమయం.. ఇటు వరుణ కటాక్షం

ఎండావానల నడుమ శ్రీహరి విహారం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్పస్వామి భక్తకోటిని కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, కర్పూర హారతులు, గోవిందనామస్మరణలతో సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతం గా సాగింది. వాహన సేవ జరిగినంత సేపు ఎండ తీవ్రత వున్నా తర్వాత గంటన్నర పాటు జోరు వర్షం కురిసిం ది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో తెల్లటి పుష్పాలు, స్వర్ణాభరణాలతో చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి మురళీ కృష్ణుడి అలంకారంలో అనుగ్రహించారు. వాహనసేవ ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు వర్షం మొదలవడంతో భక్తులు తడిచి ముద్దయ్యారు. ఉత్సవమూర్తులు తడవకుండా ఘటాటోపం కింద మలయప్పను చేర్చి గ్యాలరీల్లోని భక్తులకు దర్శనం చేయించారు. అలాగే చినుకులు, పొగమంచు వాతావరణంలోనే గజరాజులు ముందు నడుస్తుండగా, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, వేదమంత్రాల నడుమ వాహనసేవ మెల్లగా సాగింది. వర్షంలోనే కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సిబ్బంది రెయిన్‌కోట్లు ధరించి వాహనసేవలో పాల్గొన్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 22 , 2026 | 01:31 AM