Share News

భూసేకరణకు పరుగులు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:52 AM

ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్న యంత్రాంగం

భూసేకరణకు పరుగులు

తిరుపతి(టీటీడీ), అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పరిధిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, రవాణా వ్యవస్థను కల్పించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఏ తేదీలోగా భూసేకరణ పూర్తి చేయాలనుకుంటున్నామనే విషయమై లక్ష్యాలను నిర్దేశించుకున్న అధికారులు ఆలోపే భూమిని సేకరించి పనులను ప్రారంభింపజేసే విధంగా కసరత్తు చేపట్టారు. తిరుపతి జిల్లా పరిధిలో అటు రైల్వే ఇటు రహదారి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. వీటిని త్వరితగతిన పూర్తి చేస్తే భక్తులతో పాటు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కొంత మేరకు మాత్రమే భూసేకరణను చేపట్టాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా గుమ్మిడిపూండి-గూడూరు మధ్య 3వ, 4వ లైను ఏర్పాటుకు సంబఽంధించి 115.29 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ స్టేషన్ల నడుమ 90 కి.మీల మేరకు 3వ, 4వ రైల్వే లైను ఏర్పాటుకు కేంద్రం రూ.2229 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.ఈ ప్రాజెక్టు పూర్తయితే కామరాజార్‌(ఎన్నోర్‌), కృష్ణపట్నం పోర్టుల అనుసంధానం మరింత బలోపేతం చేస్తుంది.తద్వారా ఏడాదికి అదనంగా 21.24 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాకు వీలు ఏర్పడుతుంది. తద్వారా ప్రతి ఏడాది రవాణా ఖర్చుల్లో రూ.382.15 కోట్ల మేరకు ఆదా అవుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అరక్కోణం - రేణిగుంట మధ్య 77 కి.మీల మేరకు 3వ, 4వ రైల్వే లైన్లను రూ.1936.46 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. దీనివల్ల తిరువళ్లూరులోని ఎస్‌ఐడీసీవో, రాణీపేటలోని ఎస్‌ఐపీసీఓటీ, అరక్కోణం పరిసరాల్లోని సిమెంటు పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంది. తద్వారా అదనంగా 7.21 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది రవాణా ఖర్చుల్లో సుమారు రూ.110 కోట్ల మేరకు ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణను త్వరగా పూర్తిచేసి ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు ఉన్న అనేక సానుకూల అంశాలను అందిపుచ్చుకుని ఇక్కడ పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీసిటీకి వచ్చిన సందర్భంగా తగిన భూసేకరణ పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే శ్రీసిటీ ఫేజ్‌-2 పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మరో 2392.53 ఎకరాలను సేకరిస్తున్నారు. తద్వారా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. మరోవైపు ఇటు నాయుడుపేట సైతం అటు చెన్నై, ఇటు కృష్ణపట్నం పోర్టులకు ఎంతో దగ్గరగా ఉంది. జాతీయ హైవేలతోపాటు రైల్వే కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ 3728.22 ఎకరాలను సేకరించడం ద్వారా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ఇటు పరిశ్రమలతోపాటు ఇతర ప్రాజెక్టులు సైతం పూర్తయి ప్రజలకు మెరుగైన రవాణా, సౌకర్యాలతోపాటు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Oct 08 , 2026 | 12:52 AM