Share News

ఇంధనం కోసం బంకుల వద్ద క్యూలైన్లు

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:42 AM

తిరుపతి :జిల్లావ్యాప్తంగా డీజల్‌, పెట్రోల్‌ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరం నుంచి గ్రామాల వరకు పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.

  ఇంధనం కోసం బంకుల వద్ద క్యూలైన్లు
తిరుపతిలో రామానుజ సర్కిల్‌ వద్ద పెట్రోల్‌ బంకు నుంచి రోడ్డు పొడుగునా ఇంధనం కోసం వచ్చిన వాహనాల క్యూ

తిరుపతి సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):జిల్లావ్యాప్తంగా డీజల్‌, పెట్రోల్‌ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరం నుంచి గ్రామాల వరకు పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దాదాపు 26 బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టడంతో పెట్రోల్‌ కోసం బంకు బంకూ తిరగాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.మరోవైపు డీజల్‌ అందక ఆటో, ట్రాక్టర్‌, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం రవాణా రంగంపై పడనుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవసాయ పనుల కోసం డీజల్‌ అందక రైతులు పనులు నిలిపివేయాల్సి వస్తోంది. పెట్రోల్‌ బంక్‌ యజమానులు మాత్రం సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, ఇండెంట్‌ పెట్టిన నాలుగైదు రోజులకు ఆయిల్‌ కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయని చెబుతున్నారు.

సూళ్లూరుపేటలో బంకులన్నీ మూత

సూళ్లూరుపేటలో ఆదివారం రాత్రి పెట్రోల్‌ బంకులన్నీ మూతపడ్డాయి. డీజల్‌ కొరతంటూ ప్రచారం జరగడంతో వాహనదారులు, రైతులు పెట్రోల్‌ బంకుల వద్దకు పరుగులు తీశారు. ఆర్డీవో దేవేంద్ర రెడ్డి ఆదేశాలతో సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో తహసీల్దార్లు పెట్రోల్‌ బంకులను తనిఖీ చేసి నిల్వలను గుర్తించారు.సరిపడా నిల్వలున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ 6 గంటలకు ఆర్డీవో ప్రకటించారు.ఆయన ప్రకటన విడుదల చేసిన గంటన్నరకే సూళ్లూరుపేటలో అన్ని పెట్రోల్‌ బంకులు డీజిల్‌, పెట్రోల్‌ లేదంటూ బోర్డులు పెట్టి మూసేశారు. సూళ్లూరుపేట నుంచి శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలకు వందలాది బస్సులు, ఇతర వాహనాలు కార్మికులను, ఉద్యోగులను తీసుకుని వెళ్తుంటాయి. ఇంధన కొరతతో ఆదివారం రాత్రి చాలా వాహనాలు వెళ్లలేని పరిస్థితి.తడ, దొరవారి సత్రం మండలాల్లో కూడా అన్ని బంకులనూ ఆదివారం రాత్రి 8గంటలకు మూసేశారు చిట్టమూరు, వాకాడు మండలాల్లో సాయంత్రం ఐదు గంటలకే బంకులు మూతపడ్డాయి. నాయుడుపేట మండలంలో పెట్రోల్‌కు పెద్దగా ఇబ్బందిలేదు కానీ డీజల్‌ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులకోసం పెద్దఎత్తున డీజిల్‌ వినియోగిస్తుంటారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరదయ్యపాళెం మండలంలో కూడా పలుచోట్ల డీజల్‌ కొరత కనిపించింది. చంద్రగిరిలోనూ తిరుపతిలో ప్రభావమే కనిపించింది. సత్యవేడు మండలంలో తమిళనాడు డీజల్‌ బ్లాక్‌లో అమ్ముతున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 27 , 2026 | 01:42 AM