Share News

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య

ABN , Publish Date - Aug 10 , 2026 | 02:01 AM

ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య

తిరుపతి రూరల్‌, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని రాహుల్‌ ఫంక్షన్‌ హాల్‌లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్ల(డీడీవోలు)కు ఆదివారం నిర్వహించిన ఎస్‌ఎన్‌ఏ - ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్‌ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించే బాధ్యత విద్యాశాఖలోని ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. పాఠశాల విద్యా నాణ్యత, నాయకత్వం, విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. విద్యావ్యవస్థకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మూల స్తంభాలన్నారు. టీచర్లు తమ జ్ఞానం, అనుభవం, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ విద్యార్థి కేంద్రిత, అనుభవాత్మక, సరికొత్త బోధనా పద్ధతులు అమలు చేయాలన్నారు. హెచ్‌ఎంలు కేవలం పరిపాలనా బాధ్యతలకే పరిమితం కాకుండా మార్గదర్శకులు, ఆదర్శప్రాయులుగా వ్యవహరించాలన్నారు. అవసరమైనప్పుడు బోధించాలని తెలిపారు. అలాగే తమ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను తరచూ తనిఖీ చేయాలన్నారు. బోధనా విధానం, టీఎంఎల్‌ల వినియోగం, అభ్యాస పురోగతి పరిశీలించాలన్నారు. ఎస్‌ఆర్‌కేవీఎం ద్వారా అందిస్తున్న విద్యాసామగ్రి ప్రతి విద్యార్థికీ సకాలంలో అందేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు వంటి ప్రాథమిక అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు టీఏఆర్‌ఎల్‌ విధానం, హెచ్‌పీసీ కార్డులు కూడా సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పాఠశాల గ్రంథాలయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి వారిలో చదివే అలవాటును పెంపొందించాలన్నారు. సైన్స్‌ ల్యాబ్లు, స్టెమ్‌, అటల్‌ టింకరింగ్‌, పాల్‌ ల్యాబ్స్‌ కేవలం మౌలిక సదుపాయాలుగా మిగలకుండా విద్యార్థుల అభ్యసనలో క్రియాశీలకంగా ఉపయోగించాలన్నారు. విద్యార్థులకు పరిశీలన, ప్రయోగం, ప్రశ్నించడం, అన్వేషణ, సమస్య పరిష్కారం లాంటి అవకాశాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో భాగంగా హెచ్‌ఎంలు మిడేమీల్స్‌ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈకార్యక్రమానికి ప్రభుత్వం దాదాపు రూ.1500కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కంట్రోలర్‌ రాజగోపాల రావు, కడప ఆర్జేడీ కె.శామ్యూల్‌, తిరుపతి డీఈవో కే.వీ.ఎన్‌.కుమార్‌, పీఎంశ్రీ ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.ప్రసాదరావు, సీమ్యాట్‌ లెక్చరర్‌ సురేష్‌, ఆయా జిల్లాల సమగ్ర శిక్ష ఏపీసీలు, ఏఎంవోలు, ఏసీవోలు, డీవైఈవోలు, ఎంఈవోలు, డీడీవోలు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 02:01 AM