గన్నీ బ్యాగులపై క్యూఆర్ కోడ్
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:09 AM
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ‘క్యూఆర్ కోడ్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం డీలర్‌కు చేరవరకు పారదర్శకత కోసం గన్నీ బ్యాగులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. సెప్టెంబరు నెల కోటా నుంచి అమల్లోకి వచ్చే ఈ క్యూఆర్ కోడ్ ప్రక్రియకు సంబంధించి.. మూడు రోజులుగా యంత్రాంగం అమలు చేస్తోంది.
రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు
అక్రమ రవాణాలో పట్టుబడితే క్యూఆర్ కోడ్‌తో డీలర్ గుర్తింపు
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ‘క్యూఆర్ కోడ్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం డీలర్‌కు చేరవరకు పారదర్శకత కోసం గన్నీ బ్యాగులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. సెప్టెంబరు నెల కోటా నుంచి అమల్లోకి వచ్చే ఈ క్యూఆర్ కోడ్ ప్రక్రియకు సంబంధించి.. మూడు రోజులుగా యంత్రాంగం అమలు చేస్తోంది.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
జిల్లాకు సెప్టెంబరు నెల కోటాగా 9 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి 1.80 లక్షల గన్నీ బ్యాగులు ఉంటాయి. ఈ బ్యాగులపై క్యూఆర్ కోడ్ లేకుండా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి ఒక్క బియ్యం బస్తా కూడా బయటికి వెళ్లకూడదు. ఈ క్యూర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియను 12 మండలస్థాయి స్టాకిస్ట్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ ఇన్‌చార్జులు, 1280 మంది డీలర్లు పూర్తి చేయించుకోవాలి. ఆ తర్వాతే సెప్టెంబరు ఒకటో తేది నుంచి డీలర్లు బియ్యం పంపిణీ చేపట్టాలి. ప్రధానంగా బియ్యం బస్తాలు డిపోలకు కూడా చేరకుండానే జరుగుతున్న అడ్వాన్స్ లిఫ్టింగ్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. రేషన్‌లో అక్రమాలను కట్టడి చేసేందుకు డిజిటల్ స్కానింగ్ విధానాన్ని ఈనెల ఏడో తేది నుంచి అమల్లోకి తెచ్చారు. ఆగస్టు నెలకు సంబంధించి ఆదేశాలు అందే సమయానికి 270 దుకాణాలకు వెళుతున్న రేషన్ బియ్యం బ్యాగులపై క్యూఆర్ స్కానింగ్ విధానం అమలు చేసి డీలర్లకు పంపారు. ఈ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సగటున ఒక్కో డీలర్‌కు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఇస్తారు. అంటే 200 గన్నీ రేషన్ బ్యాగుల బియ్యం ఉంటుంది. ఈ స్కానింగ్ విధానాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చారు. కోడ్ చేసిన బ్యాగులను పంపిణీ చేయడానికి అవకాశం ఇచ్చారు.
స్కానింగ్ ఇలా..
క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడానికి.. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి తమ ప్రొఫైల్ వివరాలను సరిచూసుకొని అవసరమైతే అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ యాప్‌లో యూజర్ ఐడీతో లాగిన్ అయి స్టాక్ రిసిప్ట్ ఆప్షన్‌లో సంబంధిత గోడౌన్, ట్రక్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. స్ర్కీన్‌పై కనిపిస్తున్న బస్తాల సంఖ్య, బియ్యం పరిమాణం సరైనవో, కావో సరిచూసుకొని ప్లస్ గుర్తుపై నొక్కి ముందుకువెళ్లాలి. తర్వాత గన్నీ బ్యాగులపై ఉన్న క్యూఆర్ కోడ్‌కు మొబైల్ కెమెరాతో స్కాన్ చేయాలి. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోతే ట్యాగ్‌పై ఉన్న సీరియల్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఇలా నిర్ణీత పరిమాణంలో ట్యాగుల స్కానింగ్ పూర్తయినట్టు యాప్‌లో నిర్ధారణ వచ్చినప్పుడే ఈ ప్రక్రియ ముగుస్తుంది. క్యూఆర్ కోడ్ విషయంలో కూడా ఇదే పద్ధతి ఉంటుంది.
వచ్చే నెల నుంచి పూర్తిస్థాయి అమలు
ఈ విధానం వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అక్రమ రవాణాలో రేషన్ బియ్యం పట్టుబడినప్పుడు బస్తా మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. దీంతో ఆ బస్తా ఏ డీలర్ నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. ఆ డీలర్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అవసరమైతే లైసెన్సు రద్దు చేస్తారు. ఆ డీలర్లను విచారించడం ద్వారా ఎవరికి విక్రయించారు? ఎక్కడికి తరలించారనే వివరాలూ తెలుసుకోవచ్చు.
- లక్ష్మి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్