పాదరక్షల కౌంటర్‌కు ‘క్యూఆర్’ కోడ్
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:57 AM
తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం ఉదయం ప్రారంభించారు.
తిరుమల, జనవరి13(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ విధానాన్ని తొలుత వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 వద్ద ప్రారంభించగా మంచి ఫలితాలు ఇవ్వడంతో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తమ పాదరక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్లిప్ అందుతుందన్నారు. ఈ స్లిప్‌లో పాదరక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబరు, బాక్స్ నెంబరు, ఉంచిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయన్నారు. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్‌ను స్కాన్ చేయగానే పాదరక్షలున్న స్థానం డిస్‌ప్లే అవుతుందన్నారు. దీనివల్ల గుట్టలుగా పడున్న వాటిలోంచి తమ పాదరక్షలు వెతుక్కోలేక భక్తులు పడే ఇబ్బందులు తగ్గాయన్నారు. ప్రస్తుతం దాదాపు 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ దాతృత్వంతో దీనిని నిర్వహిస్తోందని తెలిపారు. భక్తులు కూడా తమ పాదరక్షలను ఎక్కడపడితే అక్కడ వదలకుండా నిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.