భక్తుల వసతి కష్టాలకు చెక్
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:01 AM
శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ పడనుంది. తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షి్‌పనకు సోమవారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.
- అలిపిరి సమీపంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షి్‌ప
- నేడు వర్చువల్ విధానంలో
శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
తిరుపతి(టీటీడీ), అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ పడనుంది. తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షి్‌పనకు సోమవారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో రూ.230 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు, తుడా పరిధిలో రూ.250 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.
భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో..
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నాలుగు నెలల కాలంలో రోజూ ఏకంగా సుమారు 80వేల నుంచి 90వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీరికి కొండపై వసతి కల్పించడం టీటీడీకి ఇబ్బందికరంగా మారింది. వీరంతా తిరుపతిలోనే ప్రైవేటు హోటళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షి్‌ప నిర్మించాలని చంద్రబాబు అభిలషించారు. దీనికి అనుగుణంగా అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్కు వద్ద 20 ఎకరాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమేజ్ టౌన్‌షి్‌ప నిర్మించేందుకు టీటీడీ నిర్ణయించింది. మొత్తం 26వేల మంది భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఆస్కారం ఉంది. ఇందుకు సుమారు రూ.2750 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో జీ+9 విధానంలో నాలుగు బ్లాకుల్లో 10వేల మందికి వసతి సౌకర్యం కల్పించే విధంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. అదేవిధంగా జీ+4లో నాలుగు బ్లాకుల్లో 16వేల మంది ఉండే విధంగా నాలుగు పీఏసీ బ్లాకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు తిరుపతికి ప్రస్తుతం అనేకమంది సొంత వాహనాల్లో వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇక్కడే జీ+5లో 4500 వాహనాలు పట్టే విధంగా మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఇక్కడే జీ+3లో 6వేల మంది కూర్చుని అన్నప్రసాదాలు స్వీకరించేలా సెంట్రలైజ్డ్ కిచెన్‌తో సహా భవనాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడి నుంచే భక్తులు కొండపైకి వెళ్లేందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ కోసం జీ+2లో 30 బస్‌బేలను నిర్మించనున్నారు. మరోవైపు శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పే విధంగా జీ+2లో థియేటర్, డిజిటల్ మ్యూజియం, గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు.
ఉద్యోగుల ఇళ్ల స్థలాల వద్ద..
వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద ఉన్న 432 ఎకరాల పరిధిలో 5192 మంది ఉద్యోగులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఇక్కడ స్థలాలు ఇచ్చినా ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఈవిషయాన్ని ఉద్యోగులు ముఖ్యమంత్రికి, టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గత నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ మౌలిక వసతుల కల్పనకు సీఎం నిర్ణయించారు. సుమారు రూ.230 కోట్లతో పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ పక్కా రహదారులను ఏర్పాటు చేసి బీటీ పనులు చేపట్టనున్నారు. డ్రెయిన్లు, వర్షపు నీటి కాల్వలు, ఓహెచ్‌ఆర్‌లు, నీటి సరఫరా కోసం పైప్‌లైన్లు, ఎస్‌టీపీలు, భూగర్భ మురుగునీటి కాల్వలు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, పోల్స్, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.
మాస్టర్‌ప్లాన్ రోడ్ల కోసం..
తిరుపతితోపాటు తిరుచానూరు వెళ్లే రహదారులు భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటు తిరుపతితోపాటు తిరుచానూరు ఆలయానికి వెళ్లే మార్గాల మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయాలని తుడా అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రూ.250 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి నేడు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.