Share News

కరువుకు ఇలా చెక్‌...

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:36 AM

ముందుగానే మేల్కొన్న అధికారులు కొద్దిపాటి తేమతోనూ ముందడుగు ఫలిస్తున్న పీఎండీఎస్‌ విధానం 49 వేల ఎకరాల్లో జోరుగా సాగు

 కరువుకు ఇలా చెక్‌...
చిన్నమండ్యం మండలంలో పీఎండీఎ్‌సలో సాగు చేసిన మిశ్రమ పంటను పరిశీలిస్తున్న రైతులు

మదనపల్లె టౌన్‌, జూలై 14(ఆంరఽధజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా వాన చినుకు జాడలేదు. వేరుశనగ సాగుకు దుక్కులు దున్నిన పొలాల్లో తేమశాతం తగ్గిపోయి బెట్టబారుతున్నాయి. ఈ తరుణంలో చేపట్టిన పీఎండీఎస్‌ (ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌) విధానం సత్ఫలితాలిస్తోంది. రైతుల ముఖాల్లో కరువు భయం పోయి ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో 49వేల ఎకరాల్లో ఈ విధానం కింద పంటలు సాగు చేస్తుండటం ఇందుకు నిదర్శనం.

ప్రకృతి వ్యవసాయానికి అనుసంఽధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎండీఎస్‌ విధానం జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా వేసవికి ముందుగానే పొలాలు బీడుగా మారకుండా ఈవిధానంతో 30 రకాల విత్తనాలతో మిశ్రమపంట సాగు చేస్తారు. బీడు భూములను ఒకసాలు దుక్కి దున్నాక విత్తన గుళికలు చల్లుతారు. వాతావరణంలో కొద్దిపాటి తేమ(మంచు) ఉన్నా, 5 ఎంఎం వర్షపాతం కురిసినా ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. వీటి వేర్లు 6 ఇంచిల నుంచి అడుగు వరకు భూమిలోకి పాకి తేమను ఇనుమడింపజేస్తాయి. ఈ విత్తనాలతో మొలిచే మొక్కలు మూడు అడుగుల ఎత్తు వరకు పెరగడం వల్ల భూమిపై పచ్చదనం విస్తరిస్తుంది. తద్వారా ఎండ వేడిమి నుంచి భూమిని కాపాడి బెట్టబారకుండా రక్షించడమేగాక పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. పైగా భూమి అంతర పొరల్లో సూక్ష్మక్రిములు పెరిగి, మంచి బ్యాక్టీరియా సమృద్ధిగా మొక్కలకు అందుతుంది. జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు 49వేల ఎకరాల బీడు భూముల్లో పీఎండీఎస్‌ విధానంతో పంటలు సాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో..ఎక్కువ లాభాలు

పీఎండీఎస్‌ విధానంలో 30 రకాల ధాన్యాలు, చిరుధాన్యాలను తొలుత బంకమట్టి, పేడ, బూడిదతో కలిపి చిన్ని, చిన్ని గుళికలుగా తయారు చేస్తారు.

కందులు, ఉలవలు, పెసలు, మినుములు, శనగలు, అలసందలు, చిక్కుడు(ద్విదళ బీజాలు)ను సీడ్‌బాల్స్‌(విత్తన గుళికలు) తయారు చేసి భూమిపై చల్లుతారు.

వీటితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్నలు, నూనె గింజలైన నువ్వులు, వేరుశనగ, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కుసుమలు లాంటి విత్తనాలను మిశ్రమ పంటగా సాగు చేస్తారు.

ఎకరాకు 30 కిలోల విత్తనాల గుళికలు ఉంటే సరిపోతుంది.

కిలో విత్తనాలు రూ.20 నుంచి రూ.50 పెట్టుకున్నా సరాసరిన కిలో రూ.35 చొప్పున ఎకరాకు రూ.1000 దాకా ఖర్చు వెచ్చిస్తే చాలు.

మూడు నెలల తరువాత ఎకరాలో పెరిగే పశుగ్రాసం(మిశ్రమ పంటను) రూ.5 నుంచి 8వేల వరకు విక్రయించుకోవచ్చు.

ఎల్‌నినోను తట్టుకునేలా...

సాఽధారణంగా వేసవి ముందే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీఎండీఎస్‌ ప్రారంభించి, ఖరీ్‌ఫకు ముందు ఈ పంటలను దుక్కు దున్నేసి భూమిలో కలిపేస్తారు. దీని వలన ఈ మొక్కలు భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. దీంతో ఖరీ్‌ఫలో పంటలకు రసాయన ఎరువుల అవసరం లేకుండా పోతుంది. సాగు ఖర్చు ముప్పావు వంతు తగ్గిపోతుంది. ఈ విధానం వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఉపయోగపడుతోంది. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పీఎండీఎ్‌సపై వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికతో పనిచేస్తున్నారు. జూన్‌లో 40.4 మి.మీ. మాత్రమే వర్షపాతం కురవగా, జూలైలో అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ క్రమంలో భూమిని బెట్టబారకుండా కాపాడటానికి పీఎండీఎ్‌సతో సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో కొద్దిపాటి వర్షాలు(చిరుజల్లులు) కురిసినా మిశ్రమపంట ఏపుగా పెరిగి పాడి రైతులకు బాసటగా నిలుస్తాయి.

Updated Date - Jul 15 , 2026 | 01:36 AM