పుంగనూరు టీడీపీ సమావేశంలో రచ్చ.. రచ్చ
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:37 AM
పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి మార్పు ఖాయమంటూ పులిచెర్లకు చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ అన్నారు. దీంతో చల్లా వర్గీయులు మధుసూదన్ వర్గీయులపై దాడికి దిగారు. తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ పూలకుండీలు విసిరేయడంతో వెంకట్రమణ తలకు తీవ్ర గాయమైంది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో కొందరికి మొద్దుగాయాలు అయ్యాయి.
ఫ మీటింగు వాయిదా వేసిన మంత్రులు
సమావేశ ఉద్దేశ్యం: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మార్పు విషయమై శ్రేణుల అభిప్రాయ సేకరణ.
వేదిక: తిరుపతిలోని ఓ హోటల్.
సమయం: సోమవారం మధ్యాహ్నం
అతిథులు: మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు శాప్ ఛైర్మన్ రవినాయుడు.
హాజరైంది: 2019-24 నడుమ పనిచేసిన బీఎల్‌ఏలు, ప్రస్తుత క్లస్టర్ ఇన్‌ఛార్జులు, మండల పార్టీ అధ్యక్షులు.. సుమారు 200మందిని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు వెయ్యి మంది దాకా వచ్చారు. ఆయన్ను వ్యతిరేకిస్తున్న వై.మధుసూదన్ నాయుడు వర్గం నుంచీ వంద మంది దాకా హాజరయ్యారు.
ఏం జరిగింది?: పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి మార్పు ఖాయమంటూ పులిచెర్లకు చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ అన్నారు. దీంతో చల్లా వర్గీయులు మధుసూదన్ వర్గీయులపై దాడికి దిగారు. తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ పూలకుండీలు విసిరేయడంతో వెంకట్రమణ తలకు తీవ్ర గాయమైంది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో కొందరికి మొద్దుగాయాలు అయ్యాయి. పరిస్థితి చేయిదాటుతుండటంతో మంత్రులు సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే విజయవాడలో సమావేశం ఉంటుందని, అక్కడే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. ముల్లంగి వెంకటరమణపై దాడి చేసిన వారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని మధుసూదన్ వర్గీయులు నినాదాలు చేశారు.
మీడియా ప్రతినిధుల ధర్నా
ఈ సమావేశం కవర్ చేసేందుకు వచ్చిన తమపై దాడి జరిగిందంటూ మీడియా ప్రతినిధులు హోటల్ వెలుపల ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నినదించారు. మంత్రులను పిలుచుకుని వచ్చి సర్దుబాటు చేసేందుకు రవి నాయుడు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులపై దాడి దురదృష్ణకరమంటూ మంత్రులు క్షమాపణ చెప్పారు. బాధ్యులను గుర్తించి కేసు నమోదు చేయించి, జైలుకు పంపిస్తామనడంతో మీడియా ప్రతినిధులు ధర్నా విరమించారు. అమర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముల్లంగి వెంకట్రమణను మంత్రులు పరామర్శించారు.
- పుంగనూరు, ఆంధ్రజ్యోతి