పులికాట్ పర్యాటకానికి ఊతం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:42 AM
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ప్రకటించిన పలు నిర్ణయాలు జిల్లాకు గణనీయమైన ప్రయోజనాలు కలిగించనున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్న పులికాట్ సరస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
తిరుపతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ప్రకటించిన పలు నిర్ణయాలు జిల్లాకు గణనీయమైన ప్రయోజనాలు కలిగించనున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్న పులికాట్ సరస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సూళ్ళూరుపేట, తడ మండలాల పరిధిలో వున్న ఈ సరస్సు మంచి నీటి, సముద్ర నీటి మిశ్రమం. దీంతో ఇక్కడ ప్రత్యేక పర్యావరణం ఏర్పడింది. ఏటా అక్టోబరు నుంచీ ఆరు నెలల పాటు సుదూర దేశాల నుంచీ అనేక రకాల పక్షులు వేలాదిగా ఇక్కడికి వచ్చి సేద దీరుతున్న సంగతి తెలిసిందే. పులికాట్ సరస్సులోని తక్కువ లోతు నీటిలో చేపలు, పురుగులు తింటూ అక్కడే గూళ్ళు కట్టుకుంటున్నాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి అవి పెద్దయ్యే వరకూ ఇక్కడే వుంటున్నాయి. ఆపై తమతమ నెలవులకు వేల కిలోమీటర్లు తిరుగు ప్రయాణమవుతున్నాయి. ఈ పక్షులు ఏటా వేలాది మంది పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వీటిని ఆధారం చేసుకుని ఏటా ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్‌గా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ పులికాట్ సరస్సు ప్రాంతంలో గానీ, దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యం ప్రాంతంలో గానీ నేలపైనుంచే పక్షులను వీక్షించాల్సి వుంది. దీంతో పర్యాటకులకు పులికాట్ సరస్సు పూర్తి స్థాయి సుందర దృశ్యాలు, నేలపట్టు పక్షుల అభయారణ్యపు సొగసులు తృప్తిగా వీక్షించే పరిస్థితి లేదు. నేలపట్టులో ఒకే ఒక బర్డ్ వాచింగ్ టవర్ వున్నా అది చాలా తక్కువ ఎత్తులో వుంది. దానిపైకి కూడా సందర్శకులను, పర్యాటకులను అనుమతించడం లేదు.ఈ పరిస్థితుల్లో ఆదివారం నాటి కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పులికాట్‌లో బర్డ్ వాచింగ్ టవర్లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎత్తైన వాచింగ్ టవర్స్ కనుక ఏర్పాటు చేస్తే పర్యాటకుల అనుభూతి అనేక రెట్లు పెరిగే అవకాశముంది. అలాగే పులికాట్, నేలపట్టు సహజ సౌందర్యం వీడియోలు, ఫోటోల ద్వారా మరింత విస్తృత ప్రచారం పొందే అవకాశముంది. దానికనుగుణంగా పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. దానితో పాటే ఆ ప్రాంత యువతకు ఉపాధి కూడా లభించనుంది.
హైదరాబాదు-చెన్నై హైస్పీడ్ రైల్
కారిడార్ పరిధిలోకి తిరుపతి
కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ పరిధిలోకి తిరుపతి చేరింది. అయితే ఈ కారిడార్ కింద నిర్మించే ప్రత్యేక రైల్ ట్రాక్ తిరుపతి నగరం మీదుగా కాకుండా రేణిగుంటలోని విమానాశ్రయం సమీపాన వెళుతుంది. విమానాశ్రయంతో కనెక్టివిటీ వుండేలా దానికి సమీపాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి జిల్లాలో గూడూరు, తిరుపతి ఎయిర్‌పోర్టులను కలుపుతూ కారిడార్ వెళుతుంది. ఇదివరకూ గూడూరు జిల్లా పరిధిలోనే వున్నప్పటికీ ఇటీవల జిల్లాల పునర్విభజనతో నెల్లూరు పరిధిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఇపుడు జిల్లాలో హైస్పీడ్ రైల్ కారిడార్‌లో తిరుపతి ఎయిర్ పోర్టు ప్రాంతం ఏకైక స్టేషన్ కానుంది. హైస్పీడ్ రైల్ కారిడార్‌తో చెన్నై, హైదరాబాదులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీనివల్ల ప్రతిపాదిత తిరుపతి స్టేషన్ నుంచీ రెండు నగరాలకు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.
చెన్నై-బెంగుళూరు కారిడార్‌లోకి తిరుపతిని చేర్చాలని సీఎం అభ్యర్థన
కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్‌లలో ఒకటైన చెన్నై-బెంగుళూరు కారిడార్ పరిధిలోకి చిత్తూరు జిల్లాలో పలమనేరు, చిత్తూరులను చేర్చారు. అయితే ఈ ప్రతిపాదనను పరిశీలించిన సీఎం చంద్రబాబు సంబంధిత కారిడార్ పరిధిలోకి తిరుపతిని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీంతో తిరుపతికి జాక్‌పాట్ తగలనుంది. ఏకంగా రెండు హైస్పీడ్ రైల్ కారిడార్ల పరిధిలోకి తిరుపతి రావడం అరుదైన అభివృద్ధి మలుపుగా చెప్పాలి. ఎందుకంటే ఆ తరహా సదుపాయం కేవలం హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాలకు మాత్రమే పరిమితమై వుంది. దీనివల్ల తిరుపతి నుంచీ బెంగుళూరుకు సైతం తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది.
విదేశీ పర్యాటకం, విదేశీ విద్యలకు ప్రోత్సాహకాలు
కొత్త బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విదేశీ పర్యాటకానికి, విదేశీ విద్యకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎ్‌స)ను 5 శాతం నుంచీ 2 శాతానికి తగ్గించింది. జిల్లా నుంచీ విదేశాలకు పర్యాటక ప్యాకేజీల కింద వెళుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. తిరుపతి కేంద్రంగా పలు ట్రావెల్ ఏజెన్సీలు ఏర్పాటై కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పొరుగున వున్న నేపాల్, శ్రీలంక దేశాలతో పాటు సమీపాన వున్న థాయ్‌లాండ్, మలేషియా, ఇండొనేషియా, కాంబోడియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు జిల్లా నుంచీ ఎక్కువగా వెళుతున్నారు. కేంద్ర నిర్ణయంతో ఈ పర్యాటకులపై ఆర్థిక భారం కొంతమేరకు తగ్గనుంది. దానివల్ల జిల్లా నుంచీ విదేశాలకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. అదే విధంగా కేంద్రం కొత్త బడ్జెట్‌లో విదేశీ విద్యపై టీడీఎ్‌సను లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ పరిధిలోకి చేర్చి ఎల్‌ఆర్‌ఎస్ కింద విద్యా ఖర్చుల కోసం తగ్గించడం జిల్లాపై ప్రభావం చూపనుంది. జిల్లా నుంచీ విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంది. విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తి చూపుతున్న, ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా బాగా ఎక్కువగా వుంది. ఇప్పటికే జిల్లా నుంచీ విద్యార్థులు అమెరికా మొదలుకుని ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, ఉక్రెయిన్, బెలారస్, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్ తదితర దేశాలకు ఎక్కువగా వెళుతున్నారు. ప్రధానంగా మెడిసిన్ కోర్సుల ఫీజులు, ప్యాకేజీలు ఇక్కడితో పోలిస్తే విదేశాల్లో తక్కువగా వుండడంతో ఈ కోర్సుల కోసమే ఎక్కువగా విద్యార్థులు వెళుతున్నారు. కొత్త బడ్జెట్‌లో కేంద్ర నిర్ణయం కారణంగా విదేశీ విద్య అభ్యసించే వారికి, ఔత్సాహికులకు భారం తగ్గడంతో పాటు ప్రోత్సాహకరంగా వుండనుంది.
క్యాన్సర్, డయాబెటిక్ బాధితులకు మేలు
క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల మందులపై కేంద్రం తాజా బడ్జెట్‌లో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. దానివల్ల బాధితులపై ఆర్థిక భారం కూడా తగ్గనుంది. జిల్లాలో స్వికార్, స్విమ్స్‌లో అంకాలజీ విభాగం, బాలాజీ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థలు వున్నందున క్యాన్సర్ బాధితులకు వైద్య సేవల పరంగా తిరుపతి కీలకంగా మారింది. చుట్టుపక్కల జిల్లాల నుంచీ కూడా క్యాన్సర్ బాధితులు తిరుపతికి ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఇక జిల్లాలో డయాబెటిక్ రోగులు సంఖ్య కూడా గణనీయంగా వుంది. మందుల ధరలు తగ్గనుండడం వారికి ఊరట కలిగించనుంది.
తగ్గనున్న సోలార్ ప్యానెళ్ళ ధరలు
కేంద్ర బడ్జెట్‌లో సోలార్ ప్యానెళ్లకు సంబంధించి సానుకూల నిర్ణయం జరిగింది. ప్యానెళ్ల తయారీకి వినియోగించే కీలక మెటీరియల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. జిల్లాలో ఇప్పటికే గృహ, వ్యాపార, విద్యా తదితర సంస్థల్లో సౌర విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. తిరుపతి కార్పొరేషన్, టీటీడీ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు విద్యుత్ భారం తగ్గించుకునేందుకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెతో పాటు స్వంత మండలం చంద్రగిరి అంతటా గృహాలకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల కింద రాయితీలతో ప్రభుత్వాలు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇపుడు బడ్జెట్‌లో బీసీడీని పూర్తిగా ఎత్తివేయడంతో సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గి, కొనుగోళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది. కాగా జిల్లాలో వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. స్కూటీలు మొదలుకుని, ఆటో రిక్షాలు, కార్లు, బస్సుల వరకూ సంఖ్య పెరుగుతోంది. వాటికి వాడే బ్యాటరీల ధరలు కూడా బడ్జెట్ నిర్ణయాలతో తగ్గనున్నాయి.
పొగాకు, మత్తు పదార్థాలపై పన్నుల కొరడా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మద్యం, సిగరెట్లు, బీడీలు, నిషేధిత మత్తు పదార్థాలైన గుట్కా, మసాలా తదితరాల వినియోగం ఆందోళన కలిగించే స్థాయిలో వుంది. వీటిపై కేంద్రం పన్నుల కొరడా ఝలిపించింది. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదల వల్ల ముఖ్యంగా గుట్కా, మసాలా వంటి వాటి వినియోగం ఎంతోకొంత మేర తగ్గనుంది జిల్లాలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం కొంతమేరకు మేలు చేయనుంది.
జాతీయ విద్యా సంస్థలకు కేటాయింపులపై అస్పష్టత
తిరుపతి జిల్లాలో ఐఐటీ, ఐఐఎ్‌సఈఆర్, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వంటి జాతీయ ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటికి కేంద్రం ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంది. తాజా బడ్జెట్‌లో ఈ సంస్థలకు కేటాయింపులపై స్పష్టత రావాల్సి వుంది. అలాగే తిరుపతి విమానాశ్రయం, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ వంటి వాటికి కూడా ఏమైనా నిధులు కేటాయించిందీ లేనిదీ తెలియాల్సి వుంది. అలాగే జిల్లాకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపైనా స్పష్టత రావాల్సి వుంది.