తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించండి
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:44 AM
ఇంటి వద్దే తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల ప్రత్యేకథీమ్ ‘జీరో లిటర్ గవర్నెన్స్’పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలకు కలెక్టర్ పిలుపు
తిరుపతి రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఇంటి వద్దే తడి, పొడిచెత్తలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల ప్రత్యేకథీమ్ ‘జీరో లిటర్ గవర్నెన్స్’పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చెత్తసంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఇద్దరు విద్యార్థులు 11 కిలోల పాతనోటుపుస్తకాలు, పేపర్లు స్వచ్ఛరథానికి అందజేయగా, వాటి విలువగా వచ్చిన డబ్బుతో కొత్తనోట్‌బుక్స్, స్టేషనరీని పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో ప్రతినెల మూడోశనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గతేడాది జనవరి నుంచి నిరంతరంగా సాగుతుందని చెప్పారు. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువలు లేదా రోడ్లపై పడేస్తే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు. వేస్ట్ టూ ఎనర్జీ అనేవిధానం ద్వారా చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ఈవిధంగా చెత్తని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని తెలియజేశారు. ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, సర్పంచ్ జోగి మోహన్, టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు ఎ.ఈశ్వర్‌రెడ్డి, ఆర్డీవో రామ్మోహన్, డీపీవో సుశీలదేవి, డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు, ఇన్‌చార్జి ఎంపీడీవో దయాసాగర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళాసంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.