ఎర్రచందనం పరిరక్షణకు అధికారులతో ప్రొటెక్షన్ సెల్
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:48 AM
శేషాచల అడవుల్లో వున్న ఎర్రచందనం పరిరక్షణలో అటవీశాఖ సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు రెడ్‌శాండిల్ ప్రొటెక్షన్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినట్లు నోడల్ ఆఫీసర్, తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎ్‌ఫవో రామకొండారెడ్డి తెలిపారు
తిరుపతి(కపిలతీర్థం), జనవరి 22(ఆంధ్రజ్యోతి): శేషాచల అడవుల్లో వున్న ఎర్రచందనం పరిరక్షణలో అటవీశాఖ సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు రెడ్‌శాండిల్ ప్రొటెక్షన్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినట్లు నోడల్ ఆఫీసర్, తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎ్‌ఫవో రామకొండారెడ్డి తెలిపారు.ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా అడవుల్లోకి స్మగ్లర్లు రావడం.. ఎర్రచందనం వృక్షాలను నేలకూల్చడం ఆగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది పనితీరు మెరుగుపరచడం అవసరమని భావించి రెడ్‌శాండిల్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సెల్‌లో పీలేరు ఫ్లయింగ్‌స్క్వాడ్ డీఎ్‌ఫవో, అన్నమయ్య డివిజన్ ఎఫ్‌ఆర్వో, తిరుపతి డివిజన్ ఎఫ్‌ఆర్వో, పీలేరు, తిరుపతి ప్లయింగ్‌స్క్వాడ్ ఎఫ్‌ఆర్వోలు, టాస్క్‌ఫోర్సు ఏసీఎ్‌ఫలు వుంటారన్నారు. నోడల్ ఆఫీసర్‌గా తన పర్యవేక్షణలో సీసీఎఫ్ సెల్వం ఆధ్వర్యంలో ఈ సెల్ పనిచేస్తుందన్నారు. ఎక్కడైనా స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే ఆ ప్రాంతంలో పనిచేసే సిబ్బందిని బాధ్యులుగా చేయడం జరుగుతుందన్నారు. సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శేషాచలకొండల్లో ఒక్క ఎర్రచందనం వృక్షం కూడా నేల కూలకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కూడా అవసరమన్నారు. అలాగే రోజూ కూంబింగ్, పెట్రోలింగ్ చేయడం జరుగుతుందన్నారు.