Share News

నత్తనడకన లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల ప్రాజెక్టు పురోగతి

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:30 AM

కుప్పంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించి పాల వెల్లువ సృష్టించడం ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు

నత్తనడకన లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల ప్రాజెక్టు పురోగతి
కంగుందిలో ఎదకొచ్చిన ఆవుకు ఇంజక్షన్‌ చేస్తున్న డాక్టర్‌ రవిశంకర్‌

కుప్పంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించి పాల వెల్లువ సృష్టించడం ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లను ఉచితంగా ఆవులకు వేయించే కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయిస్తున్నారు. అయితే పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలో ఏర్పడ్డ ఖాళీలు, క్షేత్రస్థాయి సిబ్బంది విధుల విషయంలో నెలకొన్న వివాదాలు, వారిలో పేరుకున్న నిర్లక్ష్యం.. వంటి కారణాలతో పాడి అభివృద్ధికోసం సీఎం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు నీరుకారిపోతున్నాయి.

కుప్పం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె,కుప్పం,శాంతిపురం, రామకుప్పం మండలాల్లో కలిపి పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం లక్ష పశువులున్నాయి. నియోజకవర్గ పరిధిలో 25,520మంది రైతులు పాడిమీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు 48 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే పాల ఉత్పత్తిని 10 లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తోంది. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లను ఎదకు వచ్చిన ఆవులకు వేయడమే ఈ ప్రాజెక్టు. ఇంజక్షన్‌ వేసిన ఆవులకు 90 శాతం పెయ్య దూడలు పుట్టే అవకాశం ఉంది. రూ.1,300 ఖరీదైన ఈ ఇంజక్షన్‌ను ఉచితంగా సరఫరా చేయడమే కాక, గ్రామగ్రామాన ప్రత్యేక శిబిరాలు పెట్టి మరీ ఎదకొచ్చిన ఆవులకు వేస్తున్నారు. సుమారు పది నెలలనుంచి ఈ ప్రాజెక్టు నియోజకవర్గంలో కొనసాగుతున్నా ఇంజక్షన్లను ఆవులకు వేయించడానికి పాడి రైతులు ముందుకు రావడంలేదన్నది పశు వైద్యాధికారుల ఫిర్యాదు. ఇప్పటిదాకా కేవలం 24 వేల ఆవులకు మాత్రమే ఇంజక్షన్లు వేశారని చూపిస్తున్న గణాంకాలు ఈ ప్రాజెక్టు ఎంత నత్తనడకన సాగుతోందో తెలియజేస్తుంది.

ఖాళీలు.. విధుల వివాదాలతోనే

లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లు వేసే ప్రాజెక్టు అమలవుతున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో సీఎంవో నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండడంతో పాటు అధికారులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత నెల 18వ తేదీన కడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో క్షేత్రస్థాయి సిబ్బంది అయిన అనిమల్‌ హజ్బెండ్రీ అసిస్టెంట్‌ (ఆహా) సిబ్బంది విధుల విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం పట్ల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సీరియస్‌ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆహా సిబ్బంది విధుల విషయంలో ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన పరిస్థితి వెలుగు చూసింది. అనిమల్‌ హజ్బెండ్రీ అసిస్టెంట్లు సచివాలయాల పరిధిలోకి వస్తారు. వీరి వేతనాలు పంచాయతీ సెక్రటరీల ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. సహజంగానే తమ ఆధీనంలో ఉన్న ఆహా సిబ్బందికి, సెక్రటరీలు సచివాలయాల పరిధిలో జరుగుతున్న పలు సర్వే విధులను కేటాయిస్తున్నారు. అదే సమయంలో పాడి పరిశ్రమాభివృద్ధి శాఖకు సంబంధించిన విధులు కూడా ఆహా సిబ్బంది చేయాల్సి ఉంటుంది.అటు సెక్రటరీలు కేటాయిస్తున్న సర్వేల్లో పడి ఈ ఇంజక్షన్ల అవగాహన విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాఽధించలేకపోతున్నామని, సదరు క్షేత్రస్థాయి సిబ్బంది ఎమ్మెల్సీ ఎదుటనే తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆయన అప్పటికప్పుడు నాలుగు మండలాల ఎంపీడీవోలతో మాట్లాడారు కానీ, సమస్య పరిష్కారం కాకుండానే సమీక్ష ముగిసిపోయింది. ఇంజక్షన్ల విషయంలో లక్ష్యం చేరలేక పోవడానికి ఇదొక కారణమైతే, గ్రామీణ స్థాయి పశు వైద్య శాలల్లో వెటర్నరీ అసిస్టెంటు పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగా ఉండడం మరో ముఖ్య కారణం. కుప్పం మండలంలో పైపాళ్యం, మల్లానూరు, కంగుంది, గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, రామకుప్పం మండలంలో రామకుప్పం, వీర్నమల, కొంగనపల్లె, విజలాపురంలలో పశువైద్య శాలలున్నా ఒక్క దానిలో కూడా వెటర్నరీ అసిస్టెంట్లు లేరు. అలాగే కుప్పం వెటర్నరీ ఏడీ పోస్టు కూడా ఖాళీగా ఉంది. డాక్టర్‌ రవిశంకర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా పశువైద్య శాలల్లోని ఖాళీలు, ఆహా సిబ్బంది విధుల నిర్వహణలో ఏర్పడుతున్న వివాదాలు పాడి రైతులకు ఎనలేని మేలు చేకూర్చే లింగనిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల పైలెట్‌ ప్రాజెక్టు పురోగతికి అడ్డు తగులుతున్నాయి.

సంపూర్ణ ఆరోగ్యంతో పెయ్య దూడలు

లింగనిర్ధారిత వీర్యం ఇంజక్షన్లపై పాడి రైతుల్లో అపోహలు తొలగేలా పదిరోజుల క్రితం పైపాళ్యం పంచాయతీ పెద్దవోణి గ్రామంలో శివరాజు కొట్టంలో పెయ్య దూడ జన్మించింది. ఎదకొచ్చిన ఆవుకు సుమారు 9 నెలల క్రితం లింగ నిర్ధారిత వీర్యాన్ని పశువైద్యాధికారులు ఇంజెక్ట్‌ చేశారు.దీంతో సూటిదైన ఆవు, పెయ్య దూడకు జన్మనిచ్చింది.పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆరీఫ్‌ ఈ ఆవుదూడలను పరిశీలించి వెళ్లారు.

Updated Date - Jan 07 , 2026 | 01:30 AM