Share News

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 16 , 2026 | 02:06 AM

‘వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కూటమి ప్రభుత ్వం రాగానే ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం.. పెట్టుబడులు ఆకర్షిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం..’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ జిల్లా కేంద్రం మదనపల్లె పోలీసు పరేడ్‌ గ్రౌండులో శనివారం ఘనంగా నిర్వహించారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి రాంప్రసాదరెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ

ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు..

స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి మండి పల్లె

అన్నమయ్య, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కూటమి ప్రభుత ్వం రాగానే ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం.. పెట్టుబడులు ఆకర్షిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం..’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ జిల్లా కేంద్రం మదనపల్లె పోలీసు పరేడ్‌ గ్రౌండులో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులతో గౌరవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రగతి నివేదికను వినిపించారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొంటూ జిల్లాకు చెందిన ఎర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి, గండ్రాయుడు, చంద్రశేఖర్‌రెడ్డిలను స్మరించుకున్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు వెచ్చించిందని తెలిపారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించి ముందుకెళుతున్నామన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 1.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.110.77 లక్షల కోట్లు జమ చేశామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం ద్వారా జిల్లాలో 1.93 లక్షల మంది విద్యార్థులకు రూ.289.10 లక్షల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు జిల్లాకు చెందిన 3.83 కోట్ల మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, 3.99 లక్షల మంది దివ్యాంగ ప్రయాణికులకు రూ.150 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించారు. అలాగే నేతన్న సేవలో పథకం ద్వారా 3,950 మంది చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.25 వేల చొప్పున రూ.9.67 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వీటితో పాటు ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌, ఏఎస్పీ వెంకటాద్రి, సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, డీఆర్‌వో వెంకటేష్‌, ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు. ఇందులో శక్తి, వజ్ర, మైన్‌, రవాణా, స్ర్తీశక్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), ఉద్యానవన, స్కౌట్‌, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, వైద్య, ఆరోగ్యశాఖ, 108, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌(అన్నా క్యాంటిన్‌), జలవనరుల శాఖ, విద్యుత్తు, పశుసంవర్థక శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి.

స్కేటింగ్‌ చిన్నారికి మెమెంటో..

పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారి అనంత దీక్షిత్‌ మదనపల్లె నుంచి కదిరి వరకు 79కిలోమీటర్లు స్కేటింగ్‌ చేస్తూ రికార్డు సృష్టించాడు. ఆ బుడతను అభినందిస్తూ మంత్రి చేతుల మీదుగా మెమెంటో అందజేశారు. జిల్లాలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన531 మంది ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు స్టాళ్లను పరిశీలించిన మంత్రి ఆయాశాఖల లబ్ధిదారులకు రూ.66.64లక్షల విలువైన ఆస్తులను పంపిణీ చేశారు.

సమరయోధులకు సత్కారం

దేశ స్వాతంత్య్రంలో పాలుపంచుకున్న సమరయోధులు, వారి కుటుంబీకులను కార్యక్రమం మొదట్లో మంత్రి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌, ఎస్పీ, ఏఎస్పీ, డీఆర్‌వో, సబ్‌ కలెక్టర్‌లు ఘనంగా సత్కరించారు. ఇందులో లేట్‌ సి.శ్రీనివాసరావు, జె.సిద్దప్పనాయుడు, ఎం.పాపన్నగుప్త, డివి.నారాయణశెట్టి కుమారులు సి.సీతారామయ్య, జె.భవానీప్రసాద్‌, ఎంపీ మెహన్‌గుప్తా, డివి.భాస్కర్‌శెట్టిలను సన్మానించారు.

ప్రతిభకు బహుమతులు

సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన ఏపీఎస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలకు ప్రథమ బహుమతి, పీపుల్‌ ట్రీస్కూల్‌ విద్యార్థులకు ద్వితీయ, కలికిరి సైనిక్‌ స్కూల్‌కు తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శన చేసిన మిగిలిన పాఠశాల విద్యార్థులకూ బహుమతులు అందజేశారు. రవాణాశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విద్యాశాఖలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వ్యవసాయశాఖకు ప్రథమ, స్ర్తీ శిశుసంక్షేమశాఖకు ద్వితీయ, పరిశ్రమలకు తృతీయ బహుమతులను మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌, సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా చేతుల మీదుగా అందజేశారు.

Updated Date - Aug 16 , 2026 | 02:06 AM