Share News

తాగునీటి నాణ్యతకు ప్రాధాన్యమివ్వండి

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:11 AM

ప్రతి ఆవాసంలో నీటి పరీక్షలు నిర్వహించాలి అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశం

తాగునీటి నాణ్యతకు ప్రాధాన్యమివ్వండి
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించండి’ అని అధికారులను చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన తాగునీటి ఎద్దడి నివారణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలోని.. ప్రతి ఆవాస ప్రాంతంలోనూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలన్నారు. ఏ ప్రాంతంలో నీరు సురక్షితంగా ఉంది, ఎక్కడ కలుషితమయ్యే ప్రమాదం ఉందో క్షేత్రస్థాయిలో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘కేవలం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తాగునీటి నాణ్యతకూ సమాన ప్రాధాన్యమివ్వాలి. నీటి నాణ్యత బాగున్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కొత్త బోర్లు వేయడం.. పాత పైపులైన్లను మార్చడం.. లీకేజీలను అరికట్టడం వంటి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పనులకే నిధులు ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలి. ప్రతి మండలంలో కనీసం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తాగునీటి సరఫరా మెరుగుదలకు పనుల అంచనాలు సిద్ధం చేయాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు జనాభా పెరిగినప్పటికీ తగిన తాగునీటి సదుపాయాలు లేని ఆవాస ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి 15 రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రపరచాలి’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వివరించారు. శాంతిపురం, గుడుపల్లె, వి.కోట, యాదమరి, పెద్దపంజాణి, కుప్పం, రామకుప్పం, పూతలపట్టు తదితర మండలాల్లో తాగునీటిపై సమీక్షించారు. పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధులు పరిమితమైనవని, వాటిని ప్రజల సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ సంక్షేమ వసతిగృహాలలో తాగునీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెండు నెలలకోసారి వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందజేయాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌ కుమార్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 01:11 AM