అక్రమ వేటకు అడ్డుకట్ట
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:00 AM
:తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకారకాపులు, మత్స్యకారులతో గురువారం నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమవేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తానని తెలిపారు
సముద్రంలో గస్తీ కోసం నాలుగు బోట్లు
సమస్యలు తెలుసుకునేందుకు వాట్సాప్ గ్రూపు
నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి):తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకారకాపులు, మత్స్యకారులతో గురువారం నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమవేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తానని తెలిపారు. సముద్రంలో గస్తీ కోసం నెల్లూరుకు రెండు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఒక్కో బోటు చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. అక్రమ వేట నిషేధానికి పోలీసు, మెరైన్, మత్స్య, అటవీశాఖలతోపాటు స్థానిక మత్స్యకారులకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. బోట్ల సంరక్షణ, కొనుగోలుకు పదిమంది మత్స్యకారులను ఎంపిక చేయాలని సూచించారు. మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలోని మూడు బోట్లకు మరమ్మతులు చేయిస్తామని, జూన్ 15లోగా కొత్త వాటిని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో మండలం నుంచి ఓ మత్స్యకారుడి పేరును ఎంపిక చేసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీ అజిత మాట్లాడుతూ తమిళనాడు బోట్ల అక్రమ వేటను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు మత్స్యకారులు ముందుకు రావాలన్నారు. అక్రమవేట సాగించే బోట్లను పట్టుకున్నాక ఏంచేయాలి.. ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. ఎన్ని కిలోమీటర్లు గస్తీ తిరగాలి... అనే అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు మత్స్యకారులతో కమిటీ ఏర్పడితే విధివిధానాలు రూపొందించుకోవచ్చని ఎస్పీ చెప్పారు.