Share News

అధ్యక్షా... నాయకత్వం ఇవ్వండి

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:58 AM

ఒకప్పుడు హేమాహేమీల్లాంటి నాయకుల్ని చూసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ.. నేడు నాయకత్వ కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సత్యవేడు, తంబళ్లపల్లె, తిరుపతి, మదనపల్లె నియోజకవర్గాల్లో శ్రేణులకు నేతృత్వం కరువైంది.

అధ్యక్షా... నాయకత్వం ఇవ్వండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి నాయకత్వ కొరత

పనులు జరక్క కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల గగ్గోలు

పార్టీకి, శ్రేణులకు నడుమ పెరుగుతున్న అగాధం

తిరుపతి, మార్చి 29 (ఆంద్రజ్యోతి): ఒకప్పుడు హేమాహేమీల్లాంటి నాయకుల్ని చూసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ.. నేడు నాయకత్వ కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సత్యవేడు, తంబళ్లపల్లె, తిరుపతి, మదనపల్లె నియోజకవర్గాల్లో శ్రేణులకు నేతృత్వం కరువైంది. సీఎం చంద్రబాబు సోమవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పార్టీకి తగిన నాయకత్వాన్ని ఇవ్వండంటూ శ్రేణులు అధినేతను అభ్యర్థిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీకి జిల్లాస్థాయిలో బలమైన నేతలు ఉండేవారు. జిల్లా పట్ల అవగాహన.. నాయకులతో పరిచయాలు ఉండేవి. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలుంటే వెళ్లి నేతల మధ్య సమన్వయం కుదిర్చేవారు. అధినేతలైన ఎన్టీఆర్‌, చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ జిల్లా సమాచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి మార్గదర్శనం పొందేవారు. ఇప్పుడు జిల్లాస్థాయి నాయకత్వానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఎమ్మెల్యేలను ఒకచోట చేర్చగలిగే నేతలే కరువయ్యారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో విభేదించే ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీలో సముచిత స్థానం, పదవులు దక్కడం లేదు. పనులు జరగడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించే నాయకత్వమే ఇప్పుడు కరువైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ స్థాయి కలిగిన నేతల్లో మాజీ మంత్రి అమరనాథరెడ్డి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ ఉన్నారు. ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు.

ఇన్‌చార్జి మంత్రుల పరిమిత పాత్ర

ఫ ఇక, ఇన్‌చార్జి మంత్రులు చాలా పరిమిత పాత్ర పోషిస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన సొంత జిల్లా (అన్నమయ్య)లోని పీలేరులో అడుగుపెట్టే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పలమనేరులోనూ పర్యటించలేదు. చిత్తూరులో ఎక్కువగా, అడపాదడపా పూతలపట్టులో, సీఎం పర్యటన సందర్భంగా కుప్పంలో తిరుగుతున్న ఆయన జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలకూ దూరంగానే ఉంటున్నారు.

ఫ ఇక, అన్నమయ్య జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా వున్న బీసీ జనార్దనరెడ్డి కూడా పీలేరుకు దూరంగానే వున్నారు. మిగిలిన సెగ్మెంట్లలో పర్యటిస్తున్నా ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు జరపడం లేదు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఫ తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ జిల్లాలో పెద్దగా పర్యటించడం లేదు. తిరుపతి మినహా మిగిలిన సెగ్మెంట్లలో పర్యటనలు చాలా అరుదనే చెప్పాలి. రెండు నెలలకోసారి డీఆర్‌సీ సమావేశాలు జరగాల్సి ఉండగా, నాలుగు నెలలుగా నిర్వహించలేదు.

ఈ నాలుగు సెగ్మెంట్లలో నాయకత్వ సమస్య

తిరుపతి రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గం. ఇప్పుడు జిల్లా కేంద్రం కూడా. ఇక్కడ సుదీర్ఘకాలంగా పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. పార్టీ బలంగానే ఉన్నా బలమైన నేత దొరకలేదనే చెప్పాలి. టీడీపీ ఆవిర్భావం వరకూ ఇక్కడ రెడ్ల ఆధిపత్యమే నడిచింది. ఆ తర్వాత కాంగ్రె్‌సలో.. ఇప్పటికీ వైసీపీలో ఆ వర్గానిదే పెత్తనం. టీడీపీ మాత్రమే తిరుపతిలో బలిజ సామాజికవర్గానికి ప్రాధాన్యమిచ్చి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తోంది. అయినా ఆ వర్గం నుంచీ బలమైన నాయకత్వం ఏర్పడలేదు. ఇక, సంఖ్యాపరంంగా అధికంగా ఉన్న యాదవ సామాజికవర్గానికీ టీడీపీ ప్రాముఖ్యత ఇస్తోంది. ఆ వర్గం నుంచీ బలమైన నాయకులు తయారు కాలేదు.ఇది పార్టీకి బాగా నష్టం చేస్తోంది. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ఈ వర్గాలకు తుడా, మేయర్‌, టీటీడీ బోర్డు మెంబర్‌ వంటి పదవులు ప్రత్యామ్నాయంగా కేటాయించి అసెంబ్లీ టికెట్‌ ఇతర వర్గాలకు కేటాయించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అలాగైతేనే బలమైన వైసీపీ నేతలను ఢీకొనడం సాధ్యమన్న అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

సత్యవేడు ఎస్సీ రిజర్వుడు సెగ్మెంటు. అక్కడ ఎమ్మెల్యేపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు వేసి దూరం పెట్టింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా దళిత వర్గం నుంచీ కాకుండా రెడ్డి వర్గం నుంచీ ఇంఛార్జిని నియమించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంఛార్జిగా ఎవరిని నియమించినా చివరికి ఎన్నికల్లో పోటీ చేయాల్సంది దళిత వర్గం నుంచీ కాబట్టి వారినే ఇంఛార్జిగా నియమిస్తే ఎన్నికల నాటికి బలపడతారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తంబళ్లపల్లె నియోజకవర్గానికి నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు బాధ్యతలు అప్పగిస్తే ఉన్నంతలో పార్టీకి ఎంతోకొంత మేలు జరుగుతుందన్న భావనను అక్కడి శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఉన్నప్పటికీ పార్టీ నేతల నుంచీ సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు వంటి నేతలు ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నారు. అంతిమంగా శ్రేణులకు నష్టం జరిగి పార్టీ నష్టపోతోంది.

Updated Date - Mar 30 , 2026 | 12:58 AM