Share News

ఖనిజ నిక్షేపాలకు విదేశాల్లో విలువ పెంచేందుకు సన్నాహాలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:58 AM

అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె సమీపంలో గురువారం గ్రానైట్‌ క్వారీని పరిశీలించారు.

ఖనిజ నిక్షేపాలకు విదేశాల్లో విలువ పెంచేందుకు సన్నాహాలు
క్వారీని పరిశీలిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, శ్రీరామ్‌చినబాబు, ప్రసాద్‌బాబు

మంత్రి కొల్లు రవీంద్ర

మదనపల్లె, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె సమీపంలో గురువారం గ్రానైట్‌ క్వారీని పరిశీలించారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి వివిధ రకాల మినరల్స్‌ దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, వాటి విలువను మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఐరన్‌ఓర్‌, క్వాట్జ్‌, మాంగనీస్‌, డొలమైన్స్‌, లైమ్‌స్టోన్‌ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత వైసీపీ పాలనలో మైన్స్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి క్వారీలన్నీ మూత పడినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైసీపీ నేతలు అరాచకాలతోపాటు స్వలాభం కోసం ఖనిజ సంపదను కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే మూతపడిన పరిశ్రమలను తెరిపించామన్నారు. చిన్నచిన్న సమస్యలు పరిష్కరించడంతో మైన్స్‌లో ప్రభుత్వ ఆదాయం 40 శాతం పెరిగిందని తెలిపారు. వడ్డెర సోదరులకు కూటమి ప్రభుత్వం మైన్స్‌ విభాగంలో 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఇది గతం నుంచి అందుబాటులో ఉండగా దివంగత సీఎం వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి రద్దు చేశారని, తర్వాత వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ జీవోను తొక్కి పెట్టగా కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామ్‌చినబాబు, టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, వై.దొరస్వామినాయుడు, టీడీపీ సీనియర్‌ నేత ఎస్‌.జయరాంనాయుడు, సురేంద్రయాదవ్‌, మైన్స్‌ ఏడీ రంగకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మదనపల్లెకు వచ్చిన మంత్రికి జి.శ్రీరామ్‌చినబాబు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కె.మల్లికార్జుననాయుడు, స్వాగతం పలికారు.

Updated Date - Jun 12 , 2026 | 01:58 AM