Share News

విక్రమ్‌-1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:10 AM

రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి ప్రముఖుల బొమ్మలు

విక్రమ్‌-1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు

సూళ్లూరుపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌గా అభివృద్ధి చేసిన అర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. ‘మిషన్‌ ఆగమన్‌’ పేరుతో జూలై 12 నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించేందుకు స్కైరూట్‌ ఏరో స్పేస్‌ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే షార్‌లోని ప్రఽథమ ప్రయోగ వేదికపై విక్రమ్‌-1 రాకెట్‌ను అనుసంధానం చేసి పలు పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్‌లో దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు స్కైరూట్‌ వెల్లడించింది.ప్రముఖ శాస్త్రవేత్తలు సర్‌ సీవీ రామన్‌, డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సూక్ష్మ రూపాల చిత్రాలను పంపనున్నారు. ఈ రాకెట్‌ తీసుకెళ్లే పేలోడ్లలో మైక్రో ఆర్టిస్ట్‌ అజయ్‌ కుమార్‌ 18క్యారెట్ల బంగారంతో రూపొందించిన చిన్న పేలోడ్‌ ఉంది. దానిపైన నోబెల్‌ గ్రహీత సీవీ రామన్‌, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌, ఏరో స్పేస్‌ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్‌ సూక్ష్మ రూపాలను చెక్కారు. అవి ఒక్కొక్కటి బియ్యం గింజ పరిమాణం కంటే చిన్నగా ఉండేటట్లు రూపకల్పన చేశారు. కాస్మోస్‌ డైమండ్స్‌ సంస్థ రూపొందించిన ఆర్ట్‌ వర్క్‌ కాస్మిక్‌ బ్లూమ్‌ కూడా పేలోడ్‌లో ఉంది. 2022లో విక్రమ్‌-ఎస్‌ ద్వారా భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇప్పుడు విక్రమ్‌-1తో దేశపు తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ ప్రయోగానికి సిద్ధమైంది.ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో మరింత గుర్తింపు రానుంది. విక్రమ్‌ సారాభాయ్‌ పేరు మీదనే ఆర్బిటల్‌ రాకెట్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు. భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగం ఆర్బిటల్‌ ప్రయోగాల యుగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆగమన్‌ అంటే ఆగమనం అనే పేరు పెట్టారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి షార్‌లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఇంజనీర్లు అక్కడే ఉండి రాకెట్‌ అనుసంధాన పనులతో పాటు రాకెట్‌లోని అన్ని దశల పనితీరును పరీక్షించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 01:10 AM