Share News

జనగణనకు సన్నాహాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:52 AM

ప్రత్యేక యాప్‌లో కుటుంబ వివరాల నమోదు మాస్టర్‌ ట్రైనీలకు 6,7,8 తేదీల్లో చిత్తూరులో శిక్షణ

జనగణనకు సన్నాహాలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జనగణనకు సన్నాహాలు చేపట్టామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో నిలిచిపోయిందన్నారు. జిల్లాల విభజన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి రెండు దశల్లో ఈ ప్రక్రియను డిజిటల్‌ విధానంలో చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. తొలుత గృహాలు, ఆయా కుటుంబాల్లోని సభ్యుల నమోదుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు.

రెండు దశలిలా..

తొలిదశలో ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ (ఈబీ) సర్వేలో భాగంగా ఇల్లు, ఇతర నిర్మాణాలను గుర్తిస్తారు. 150 నివాస సముదాయాలను ఎన్యుమరేటర్‌కు కేటాయిస్తారు. మే ఒకటో తేదీనుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి, నెలాఖరుకు పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం జాతీయ స్థాయిలో వచ్చే ఏడాదిలో జనగణన ప్రారంభిస్తారు.

33 అంశాలతో..

ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లు ఆయా కుటుంబాలకు సంబంధించి 33అంశాల సమాచారం సేకరిస్తారు. కుటుంబంలో వ్యక్తులు, యజమాని వివరాలు, కులం, నివాస భవన స్థితి, సామాజిక మాధ్యమాల వినియోగం, తాగునీరు, వంటగది, మరుగుదొడ్డి, ఇల్లు ఏ తరహా నిర్మాణం, ఇంట్లో ఏయే పరికరాలు ఉన్నాయి తదితర వివరాలతో మొత్తం 33 అంశాలను నమోదు చేస్తారు.

కొత్త జిల్లాల ప్రకారమే..

కొత్త జిల్లాల ప్రకారమే గ్రామాలు, పట్టణాల్లో జనాభాలెక్కలు చేపట్టనున్నారు. ఈసారి జనగణన ప్రక్రియ మొబైల్‌ యాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ విధానంలో జరగనుంది. జిల్లాలోని 27 మండలాలు, చిత్తూరు నగర కార్పొరేషన్‌, నాలుగు మునిసిపాలిటీలు, 625 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు.

ఏప్రిల్‌ 15 నుంచి..

ఏప్రిల్‌ 15వ తేదీనుంచి నెలాఖరు వరకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక యాప్‌లో కుటుంబ వివరాలన్నీ వ్యక్తిగతంగా ఎవరైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మే ఒకటో తేదీనుంచి నెలాఖరులోగా ఎన్యుమరేటర్లు వారి పరిధిలో ఇంటింటా తిరిగి పూర్తివివరాలు సేకరించనున్నారు. అదే సమయంలో వ్యక్తిగత యాప్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలను కూడా మరోసారి పునఃపరిశీలన చేయనున్నారు. ఇదే సమయంలో ప్రతి ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటున్నారో నమోదు చేస్తారు. రెండో దశ కింద 2027 ఫిబ్రవరిలో 21 రోజులపాటు ఇంటింటికీ వెళ్లి జనగణన చేపట్టనున్నారు. తొలిదశలో నమోదుచేసిన కుటుంబసభ్యుల సంఖ్య స్థానంలో వారి పేర్లను నమోదు చేస్తారు.

పక్కాగా ఏర్పాట్లు

జనగణనను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్టర్‌ ట్రైనీలను మండలానికి నలుగురు చొప్పున ఎంపిక చేసి, వారికి డిజిటల్‌ విధానంలో శిక్షణ ఇవ్వనున్నాం. మార్చి 6, 7, 8 తేదీల్లో 150 మందికి స్థానిక సీతమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్వో తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 01:52 AM