Share News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:38 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
ఆలయ పాలకమండలితో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి

- రూ.100 టిక్కెట్‌పై సామూహిక రాహుకేతు పూజలు

- రూ.500 టిక్కెట్‌ రద్దు: ఎమ్మెల్యే బొజ్జల

- ధర్మకర్తలమండలి సమావేశంలో 21 అంశాల ఆమోదం

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆలయ పరిపాలన భవనంలో గురువారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులోభాగంగా 21 అంశాలను అజెండాగా చర్చించి ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, రూ.500 రాహుకేతు పూజా టిక్కెట్టును రద్దు చేస్తున్నామన్నారు. రూ.750, రూ.1,500, రూ.2,500 టిక్కెట్ల ధరలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. రూ.5వేల టిక్కెట్టును వెయ్యి పెంచి రూ.6వేలుగా కొనసాగిస్తామన్నారు. సామాన్య భక్తుల కోసం రూ.వందతో సామూహిక రాహుకేతు పూజా విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రతి బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆధార్‌, రేషన్‌కార్డు కలిగిన సామాన్య భక్తులైన 2వేలమందికి రెండు బ్యాచులుగా పూజలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అద్దాలతో వాహన మండపం

మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కొలువుదీర్చే వాహనాలను భక్తులు వీక్షించడానికి అద్దాలతో మ్యూజియం తరహాలో అధునాతంగా వాహనమండపాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సరకుల నాణ్యత ప్రమాణాల తనిఖీ నిర్ధారణ పరికరాలను ఆలయంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ నిర్వహణలో ముక్కంటి దేవస్థానానికి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం లభించిందని చెప్పారు. భక్తులు నిరీక్షించే సమయంలో అవసరమైన వెయింటింగ్‌హాల్స్‌ను మెరుగైన సౌకర్యాలతో కొత్తగా నిర్మిస్తామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ దర్శనం అనే నినాదంతో ఆలయంలో మరింత సాకేంతిక విప్లవాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్‌, ఈవో బీకే వెంకటేశులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:38 AM