Share News

సమస్యల పరిష్కారానికి ‘ప్రజాచేరువ’

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:58 AM

: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజాచేరువ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డిలు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి ‘ప్రజాచేరువ’
సమీక్షలో మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డిలు

రాయచోటి నియోజకవర్గ సమస్యలపై సమీక్ష

హాజరైన మంత్రులు గొట్టిపాటి, మండిపల్లి,జనార్దన్‌రెడ్డిలు

అన్నమయ్య, సెప్టెంబర్‌ 5(ఆంద్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజాచేరువ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డిలు పేర్కొన్నారు. ప్రజాచేరువ కార్యక్రమంలో భాగంగా శనివారం రాయచోటి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో మంత్రులు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ ఆద్వర్యంలో జిల్లా అధికారులతో కలసి రాయచోటి నియోజకవర్గ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్‌ పథకం కింద బీస్గీలకు కూడా కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రూ.700 కోట్ల అంచనాతో ఆర్‌డీఎ్‌సఎస్‌ కార్యక్రమం అమలవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు సుమారు రూ.6,200 కోట్లతో ట్రాన్స్స్‌ఫార్మర్లు, సబ్‌-స్టేషన్లు, విద్యుత్‌ లైన్ల అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.

వేగంగా రోడ్ల పనులు చేయండి

జిల్లాలోని రహదారుల నిర్వహణ, జాతీయ రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి జనార్దన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2,042.22 కిలోమీటర్ల మేర స్టేట్‌ హైవేలు(ఎ్‌సహెచ్‌), మేజర్‌ డిస్ట్రిక్‌ రోడ్లు(ఎండీఆర్‌), ఇతర జిల్లా రహదారులు (ఓడీఆర్‌) ఉన్నట్లు మంత్రి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నిర్వహణ కింద 46 పనులకు రూ.4.19 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు కాగా అన్ని పనులను ఒప్పందాలు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్‌ తదితర సేవలను డిజిటల్‌ విధానంలో సమర్థవంతంగా అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సూచించారు. గత అర్థిక సంవత్సరంతో పోలిస్తే 8.41 శాతం వృద్ధి నమోదైంద న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఆదాయంలో 9.87 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు. వాహన్‌, సారథి పోర్టల్‌ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, రవాణ శాఖలకు సంబంధించిన అంశాల్లో మంత్రులు సూచనలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యతాక్రమంలో, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఎలాంటి జాప్యం చేయరాదన్నారు. సమావేశంలో విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ, రవాణ శాఖల జిల్లా అధికారులు, ఈఈలు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 01:58 AM