పేదరికం, భార్యకు అనారోగ్యం, పిల్లల పెంపకంపై ఆందోళన
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:39 AM
అనారోగ్యం బారిన పడిన ఆమెకు మరణం తప్పదనేసరికి.. ఆ పిల్లలు అతడికి బలహీనతగా మారారు.
ఒకవైపు రోజురోజుకు క్షీణిస్తున్న అర్దాంగి ఆరోగ్యం.. మరోవైపు ఇద్దరు పిల్లల పెంపకం, పేదరికం, భవితపై ఆందోళన.. అతడి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. తన బాధను ఎవరికైనా చెప్పి ఉన్నా, అతడి స్థితిని గమనించి మనోధైర్యం చెప్పేవాళ్లున్నా పరిస్థితి మరోలా ఉండేదేమో? ఇవేవీ జరగకపోవడంతో చివరకు.. తాను ఆటలాడించి, నడక నేర్పించి, ప్రేమగా పెంచిన పిల్లలకు విషమిచ్చేలా చేసింది. ఇన్నాళ్లు భార్య ఆరోగ్యం మెరుగు పడటానికి మందులిచ్చిన అతడు.. చివరగా విషం కలిపిన జ్యూస్ తాగించాడు. తానూ ఇంటిలో ఉరికి వేలాడాడు దామోదరం. ఇలా ఒక కుటుంబమే అంతమైన హృదయ విదారక సంఘటన సోమవారం ఉదయం చిత్తూరు రూరల్ మండలంలో వెలుగు చూసింది.
భార్య నిర్మల (32), కుమార్తె శ్రీదివ్య (13), కుమారుడు దిలీప్ (11)తో కలిసి రేకుల ఇంట్లో దామోదరం(35) నివాసం ఉంటున్నారు. పలమనేరుకు చెందిన ఇతడు 20 ఏళ్ల కిందటే తన అక్క ఉంటున్న చిత్తూరు రూరల్ బంగారెడ్డిపల్లెకు వచ్చేశాడు. చదువు లేకపోవడంతో, తాపీమేస్త్రీ పనులు చేసుకుంటున్నాడు. నిర్మలది జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డి కండ్రిగ. పేదరికం అయినా, ఉన్నంతలో స్థిమితంగా ఉందా కుటుంబం. గ్రామంలోనూ మంచి పేరే ఉంది. రోజూ మేస్ర్తీ పనులకు వెళుతూ ఉన్నంతలో కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. పిల్లలూ సమీపంలోని ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్నారు. సంతోషంగా సాగిపోయిన ఆ కుటుంబంపై విధి వక్రించింది. కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్న నిర్మలకు మెదడు వ్యాధి వచ్చిందని వైద్యులు చెప్పారు. సీఎంసీ, తిరుపతిలోని స్విమ్స్, రుయాతో పాటు మరెన్నో ఆస్పత్రుల్లో చూపించాడు. తన ఆర్థిక శక్తికి మించి ఖర్చు చేశాడు. చివరకు ఫలితం లేదని వైద్యులు తేల్చేయడంతో రెక్కల కష్టంతో బతుకీడిస్తున్న తాను.. తల్లిలేకుండా పిల్లలను ఎలా పెంచాలనేది తట్టుకోలేకపోయాడు. భార్యతో కలిసి కఠిన నిర్ణయాన్నే తీసుకున్నాడు.
నాన్నా.. జ్యూస్ తాగమ్మా!
తనకు ఆస్తి పాస్తులు లేకపోయినా పిల్లలే సర్వస్వం అనుకున్నారా దంపతులు. అలాంటిది ఆదివారం రాత్రి పడుకొనే ముందు దామోదరం పిల్లలను పిలిచాడు. జ్యూస్ తాగి పడుకోమని చెప్పాడు. ఆ జ్యూస్‌లో విషం కలిపారని, తాగితే చనిపోతామని తెలియని వాళ్లు.. గుటగుట తాగేశారు. మంచంపై శ్రీవిద్య, కింద చాపపై దిలీప్ పడుకున్నారు. తర్వాత భార్య నిర్మలచేత విషం కలిపిన జ్యూస్ తాగించాడు. ఆమె పక్క గదిలో బెడ్‌పై పడుకున్నారు. అలా ముగ్గురూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ముగ్గురి మరణాన్ని నిర్ధారించుకున్నాక దామోదరం, తానూ ఇంట్లోని కమ్మీకి ఉరేసుకుని మృతి చెందాడు.
ఈ డబ్బుతోనే ‘దానం’ చేయాలి
ఇన్నాళ్లు తిన్నా తినకపోయినా ‘గుట్టుగా’ బతుకీడ్చారు. ఎవరి వద్దా చేయిచాచని ఆత్మాభిమానం అతడిది. అందుకే చనిపోయినా, తమ అంత్యక్రియల ఖర్చు మరొకరికి భారం కాకూడదనుకున్నాడు. అందుకని ముందుగానే కొంత డబ్బును వేశాడు. తన ఖాతాలకు సంబంధించి ఏటీఎం, ఫోన్‌పే పిన్‌కోడ్‌లను ఒక పేపరులో రాసి టీవీకి అతికించాడు. ‘ఈ డబ్బులతోనే మమ్మల్ని దానం (అంత్యక్రియలు) చేయి’ అని రాసిపెట్టారు. టీవీకి అతికించిన ఈ పేపరు చూసి అందరూ విలపించారు.
వ్యాధులపై అవగాహన లేకపోవడమే..
పేదరికం, చదువులేకపోవడంతో వ్యాధులపై వారికి సరైన అవగాహన ఉండదు. అలాంటి సమయంలో నయం కాని జబ్బు అయితే రోగుల బంధువులకు డాక్టర్లు నెమ్మదిగా అవగాహన కల్పించాలి. మానసికంగా వారిని సన్నద్ధం చేశాక.. ఇక ఫలితం లేదని చెప్పొచ్చు. అప్పుడైతే ఆ కుటుంబానికి బంధువులూ ధైర్యం చెప్పేవారు. మరి, దామోదరం విషయంలో ఏం జరిగిందో కానీ.. ఆ మెదడు వ్యాధితో ఆ కుటుంబం మొత్తం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో బంగారెడ్డిపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నారులను చూసి గ్రామమే కన్నీరు పెట్టుకుంది. ఆ కుటుంబానికి ఇటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించావు దేవుడా అని విలపించారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి