Share News

దర్జాగా కబ్జా

ABN , Publish Date - May 18 , 2026 | 12:58 AM

రూ.9 కోట్ల ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి విక్రయాలు

దర్జాగా కబ్జా
కాలువ వంక భూమిలో రాళ్లు నాటి వేసిన ప్లాట్లు

రేణిగుంట, మే 17 (ఆంధ్రజ్యోతి): రూ.9 కోట్ల విలువచేసే కాలవ వంక పోరంబోకు భూమి కబ్జాచేసి ఏకంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. తిరుపతి అర్బన్‌ పరిధిలోని చెన్న య్య గుంట రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనెంబర్‌ 222/3లో 85 సెంట్ల పట్టా భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌పై ఇరువర్గాల నడుమ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ పట్టా భూమికి అనుకుని సర్వేనెంబర్‌ 222/5లో 1.15 ఎకరాల కాల్వ వంక పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిని గత జనవరిలో చదును చేశారు. రెవెన్యూ సిబ్బంది అప్పట్లో అడ్డుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.అయితే కబ్జాదారులు ఆ బోర్డును పీకి పడేసి అందులో 30 ప్లాట్లు వేశారు. అంతేగాకుండా తిరుపతి నుంచి కిందకు వెళ్లే డ్రైనేజ్‌ కాల్వను అదనంగా 1.20 ఎకరా పూడ్చివేశారు. ఇందులో 30 ప్లాట్లు వేశారు. మొత్తం 60 ప్లాట్లను అంకణం రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.జీవకోనకు చెందిన ఓ నాయకుడు దీని వెనక నుంచి కథ నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.ఈ విషయంపై గ్రామస్తులు మూడు నెలల క్రితమే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ సురేష్‌బాబును ఈ విషయంపై వివరణ కోరేందుకు ఫోను చేసినా స్పందించలేదు.

Updated Date - May 18 , 2026 | 12:58 AM