సమాచార శాఖ గ్రూపులో అశ్లీల చిత్రాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:00 AM
సమాచార శాఖ గ్రూపుల్లో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సమాచార శాఖ గ్రూపుల్లో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. తన ఫోన్ హ్యాక్ అవడం వల్లే ఇలా జరిగిందని సంబంధిత అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.జిల్లా సమాచారశాఖ ఉన్నతాధికారి అటు ప్రభుత్వానికి ఇటు మీడియాకు వారధిగా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ సమాచార శాఖ గ్రూపుల్లో పోస్టు చేస్తుంటారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల గ్రూపుల్లో కూడా సభ్యుడిగా ఉంటారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6.05 గంటలకు కొన్ని అశ్లీల చిత్రాలు ఆయన ఫోన్ నుంచి ఆయా గ్రూపుల్లో పోస్ట్ అయ్యాయి. వీటిని చూసిన వారిలో కొందరు అధికారులు, మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారికి తెలిపారు. ఖంగుతిన్న ఆయన నిమిషాల వ్యవధిలోనే ఆ చిత్రాలను డిలీట్ చేశారు. తన ఫోన్ హ్యాక్ అయిందని కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు తెలియజేశారు. కలెక్టర్ సూచనతో ఆయన నివాసమున్న తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు చిత్తూరు సైబర్ క్రైమ్‌కు రెఫర్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ అధికారి ఫోన్ సీజ్ చేసి.. విచారణ చేపట్టారు. కేవలం అశ్లీల చిత్రాలను పోస్టు చేయడం వరకేనా? ఆయన బ్యాంకు ఖాతాల్లో నగదు ఏమైనా పోయిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.