Share News

తిరుపతి కేంద్రంగా పోలీస్‌ కమిషనరేట్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:42 AM

తిరుపతి జిల్లా పోలీసు శాఖలో సమూల మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకూ ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీసు పాలన త్వరలో ముగియనుంది.

తిరుపతి కేంద్రంగా పోలీస్‌ కమిషనరేట్‌

కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారి... మెజిస్టీరియల్‌ అధికారాలు

తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్ల ఏర్పాటు

అదనంగా కోఆర్డినేషన్‌ విభాగం

జోన్లు, కోఆర్డినేషన్‌ విభాగానికి డీసీపీలుగా ఎస్పీ స్థాయి అధికారులు

తిరుమల, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, శ్రీసిటీ, పుత్తూరులకు ఏసీపీలు

తిరుపతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పోలీసు శాఖలో సమూల మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకూ ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీసు పాలన త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో కమిషనరేట్‌ ఏర్పాటు కానుంది.డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో పోలీసు పరిపాలన ప్రారంభం కానుంది.జిల్లా పూర్తిగా తిరుపతి పోలీసు కమిషనరేట్‌ పరిధిలోకి రానుంది. కమిషనరేట్‌ను తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ పేరిట నాలుగు జోన్లుగా విభజించనున్నారు.ఈ నాలుగు జోన్లకు అదనంగా కోఆర్డినేషన్‌ విభాగం ఏర్పాటు కానుంది.

సబ్‌ డివిజన్ల స్థానంలో పోలీస్‌ జోన్లు

ఇప్పటి వరకూ వున్న పోలీసు సబ్‌ డివిజన్ల స్థానంలో పోలీస్‌ జోన్లు ఏర్పాటవుతాయి. తిరుమల జోన్‌కు డీసీపీ అధిపతిగా వుంటారు. ఆయన కింద డీఎస్పీ స్థాయి అదికారి ఏసీపీగా వ్యవహరిస్తారు. ఈ జోన్‌ పరిధిలోకి తిరుమల వన్‌ టౌన్‌, టూ టౌన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు వస్తాయి. అలాగే తిరుపతి జోన్‌ విషయానికొస్తే ఇద్దరు ఏసీపీలు వుంటారు. తిరుపతి ఏసీపీ పరిధిలో ఎస్వీయూ, వెస్ట్‌, ఈస్ట్‌, అలిపిరి పోలీస్‌ స్టేషన్లు, తిరుపతి రూరల్‌, తిరుచానూరు, పాకాల పోలీస్‌ స్టేషన్లు వుంటాయి. చంద్రగిరి ఏసీపీ పరిధిలో చంద్రగిరి, రామచంద్రాపురం, ఎర్రావారిపాలెం, భాకరాపేట పోలీస్‌ స్టేషన్లుంటాయి. శ్రీకాళహస్తి జోన్‌ విషయానికొస్తే ఇక్కడ కూడా ఇద్దరు ఏసీపీలు వుంటారు. శ్రీకాళహస్తి ఏసీపీ పరిధిలోకి శ్రీకాళహస్తి వన్‌ టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌, బీఎన్‌ కండ్రిగ, తొట్టంబేడు పోలీసు స్టేషన్లుంటాయి. రేణిగుంట ఏసీపీ పరిధిలోకి రేణిగుంట, గాజులమండ్యం, ఎయిర్‌పోర్టు, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు స్టేషన్లుంటాయి. శ్రీసిటీ జోన్‌లో కూడా ఇద్దరు ఏసీపీలు వుంటారు. శ్రీసిటీ ఏసీపీ పరిధిలో శ్రీసిటీ, నాయుడుపేట, దొరవారిసత్రం, పెల్లకూరు, ఓజిలి, సూళ్ళూరుపేట, శ్రీహరికోట, తడ, వాకాడు, చిట్టమూరు, వెంకటగిరి, బాలాయపల్లె, డక్కిలి పోలీస్‌ స్టేషన్లు చేరుతాయి. ఇక పుత్తూరు ఏసీపీ పరిధిలో పుత్తూరు, వడమాలపేట, నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం, సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం పోలీస్‌ స్టేషన్లు వుంటాయి.

కోఆర్డినేషన్‌ జోన్‌లోకి ఇతర విభాగాలు

ఎస్పీ స్థాయి అధికారి డీసీపీగా వ్యవహరించే కో ఆర్డినేషన్‌ జోన్‌ పరిధిలోకి పలు ఇతర విభాగాలు వస్తాయి. తిరుపతి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌, తిరుమల సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌, తిరుపతి ట్రాఫిక్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిటీ ఆర్ముడ్‌ రిజర్వు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, సిటీ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో, సిటీ ట్రాఫిక్‌ రికార్డ్‌ బ్యూరో, ఐటీ కోర్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, క్లూస్‌ టీమ్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో వంటి విభాగాలన్నింటినీ ఈ జోన్‌ డీసీపీ సమన్వయం చేసుకుని పర్యవేక్షిస్తారు.

పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నుంచీ కమిషనరేట్‌ వరకూ...

పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నుంచీ కమిషనరేట్‌ వరకూ తిరుపతి సాగించిన ప్రస్థానం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన పరిణామం. తొలుత తిరుపతి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రంగా వుండేది. 1990లలో తిరుపతి సబ్‌ డివిజన్‌కు డీఎస్పీ స్థానంలో అదనపు ఎస్పీని ప్రభుత్వం నియమించింది. 2010 ఆగస్టు 28న ప్రత్యేకంగా తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటైంది. చిత్తూరు జిల్లాలోనే వున్నప్పటికీ తిరుపతి కేంద్రంగా పోలీసు జిల్లా ఏర్పాటు చేశారు. అయితే సిబ్బంది విభజన పూర్తయి పూర్తిస్థాయిలో తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పనిచేయడం ప్రారంభమైంది మాత్రం 2016 జనవరి ఒకటి నుంచీనే. తర్వాత 2022 ఏప్రిల్‌ 4వ తేదీన తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావడంతో తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా రద్దయింది. ఇతర జిల్లాల తరహాలోనే తిరుపతి నుంచీ ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు పాలన ప్రారంభమైంది. నాలుగున్నరేళ్ళు కూడా గడవకనే ఇపుడు మరోసారి తిరుపతి కేంద్రంగా పోలీసు శాఖ మార్పుచేర్పులకు గురైంది. తిరుపతి కేంద్రంగా పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు కావడం పోలీసు పాలనాపరంగా చివరి మెట్టుగా చెప్పాలి. శాంతి భద్రతల నిర్వహణలో కమిషనర్‌కు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్టీరియల్‌ అధికారాలు లభిస్తాయి. దీంతో శాంతిభద్రతల నియంత్రణకు రెవిన్యూ అధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా కమిషనరే ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుంది. ముఖ్యంగా సమాజానికి ఇబ్బందికరంగా తయారైన అసాంఘిక శక్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలన్నా, ప్రమాదకర వ్యక్తులను నగర బహిష్కరణ లేదా జిల్లా బహిష్కరణకు గురి చేయాలన్నా సాధారణ జిల్లాల్లో కలెక్టర్లకే అధికారం వుంటుంది. ఇపుడు కమిషనరేట్‌ ఏర్పాటు కావడంతో అలాంటి అధికారాలు కమిషనర్‌కు వుంటాయి. జిల్లా ప్రజలకు ఇప్పటి వరకూ అలవాటైన డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ వంటి పేర్లు ఇక నుంచీ తిరుపతి జిల్లాలో వినిపించవు. సీపీ, డీసీపీ, ఏసీపీ వంటి పేర్లు ప్రజాజీవనంలో సర్వసాధారణం కానున్నాయి.

కమిషనరేట్‌ ఏర్పాటుకు కారణాలివే!

తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తూన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో తిరుపతిలో యాత్రికుల భద్రత కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. మరోవైపు జిల్లాలో పుత్తూరు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర మున్సిపల్‌ పట్టణాలు వున్నాయి. వీటిలో శ్రీకాళహస్తి ఇటు పుణ్యక్షేత్రంగానూ అటు పారిశ్రామికంగానూ, జాతీయ స్థాయి ఐఐటీ, ఐసర్‌ వంటి ఉన్నత విద్యా సంస్థలతోనూ కీలకంగా మారింది. ఇక సూళ్ళూరుపేటలో షార్‌ వున్న సంగతి తెలిసిందే. అలాగే సూళ్ళూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో శ్రీసిటీ మొదలుకుని పలు సెజ్‌లు, కీలక పారిశ్రామిక వాడలు వున్నాయి. తిరుపతి నగరం, ఇతర మున్సిపల్‌ పట్టణాలు వేగంగా విస్తరిస్తూ జనాభా పెరుగుతోంది. దానికనుగుణంగా సైబర్‌ నేరాలు, మహిళల పట్ల నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు వంటివి కూడా పెరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుని తిరుపతి కేంద్రంగా సాధారణ పోలీసు జిల్లా బదులు పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నియమితులవుతారు. ఆయా విభాగాలపై పర్యవేక్షణకు, నేరాల నియంత్రణకు సమర్ధత, అనుభవం, స్థాయి కలిగిన అధికారులు అందుబాటులోకి వస్తారు. శాంతి భద్రతల నిర్వహణగానీ, నేర నియంత్రణ గానీ మెరుగుపడే అవకాశముంటుంది.

Updated Date - Sep 24 , 2026 | 12:42 AM