Share News

రాత్రంతా పోలీసు తనిఖీలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:49 AM

తిరుపతి నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్‌ శాఖ రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.

రాత్రంతా పోలీసు తనిఖీలు

తిరుపతి బస్టాండులో పెద్దసంఖ్యలో పాల్గొన్న అధికారులు,సిబ్బంది

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్‌ శాఖ రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి భద్రతా పరిస్థితులు, పోలీసుల బీట్‌లు, రాత్రి గస్తీ తీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించి ఎస్టీవీ నగర్‌, లీలామహల్‌, గ్రూప్‌ థియేటర్లు, బస్టాండు, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు.ఎస్పీ నుంచి ఎస్‌ఐల దాకా పాల్గొని 20 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు, 40మంది ఎస్టీఎఫ్‌ సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. కొద్ది రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.భక్తుల ప్రశాంత యాత్రకు భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.ఏఎస్పీ రవిమనోహరాచారి,డీఎస్పీ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:49 AM