Share News

పోలీసుల యాక్షన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:43 AM

: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికతో, ముందుకెళ్లాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశించారు. తిరుపతిలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం సాయంత్రం రాయలసీమ రేంజ్‌ పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలీసుల యాక్షన్‌ ప్లాన్‌
సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా. పాల్గొన్న ఇతర ఉన్నతాధికారులు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికతో, ముందుకెళ్లాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశించారు. తిరుపతిలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం సాయంత్రం రాయలసీమ రేంజ్‌ పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరిధిలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు, గ్రామసభలు, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని సూచించారు.ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతర జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్ఠం చేసి వాహన తనిఖీలు విస్తృతం చేయాలన్నారు.సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, విద్వేషపూరిత పోస్టులతో అశాంతి సృష్టించే ప్రయత్నాలను ఉపేక్షించరాదని డీజీపీ స్పష్టం చేశారు.సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి అదనపు బలగాలను మోహరించడంతోపాటు స్ట్రైకింగ్‌ ఫోర్సులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే భద్రతా బలగాలను ఉపసంహరించకుండా , శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి గ్రామం, వార్డుపై పోలీసు అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని, ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.అదనపు డీజీపీ మధుసూదన రెడ్డి , అనంతపురం రేంజ్‌ ఐజీ డాక్టర్‌ షీమోసీ బాజ్‌పాయ్‌, డీఐజీలు కోయ ప్రవీణ్‌, విక్రాంత్‌ పాటిల్‌, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు,చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 01:43 AM