సరిహద్దుల్లో పేకాట
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:30 AM
అటు తమిళనాడు.. ఇటు ఆంధ్ర. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పేకాట నిర్వహించేది చిత్తూరు నగరానికి చెందిన వ్యక్తి.
అటు తమిళనాడు.. ఇటు ఆంధ్ర. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పేకాట నిర్వహించేది చిత్తూరు నగరానికి చెందిన వ్యక్తి. ఇటువైపు పోలీసుల తనిఖీలుంటే.. వెంటనే పేకాటను అటు తమిళనాడు పరిధిలోకి మార్చేస్తారు. అక్కడ ఇబ్బందైతే ఇటు జిల్లాలోకి వచ్చేస్తారు. ఈ సరిహద్దుల్లో పేకాటపై తమిళనాడు పోలీసులు దాడులు జరిపి ఎనిమిది మందిని పట్టుకున్నారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారికి జూదం ఒక వ్యసనం. దీనిని ఆసరాగా చేసుకుని చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి పేకాట నిర్వహణ చేపట్టాడు. చిత్తూరు నగరం, చుట్టుపక్కల పేకాట ఆడించేవాడు. ఆ తర్వాత మొబైల్ వ్యానులోనే గేమింగ్ మొదలు పెట్టాడు. ఇందులో పది మంది కూర్చునేలా చేశాడు. పోలీసుల తనిఖీలుంటే ఈ వాహనాన్ని ఆ దారిన వెళ్లనివ్వరు. కూటమి ప్రభుత్వం వచ్చాక అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. దీంతో మొబైల్ పేకాట వ్యవహారం పోలీసులకు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి పేకాట నిర్వహణను తమిళనాడు సరిహద్దుకు మార్చాడు. అటు పొన్నై.. ఇటు జిల్లా పరిధిలో మామిడి తోపులు.. కోళ్ల ఫారాలు.. పొలాల వద్ద షెడ్లలో పేకాట ఆడించేందుకు స్థానికుల ద్వారా సంబంధిత రైతులతో మాట్లాడించేవాడు. దీనికిగాను రోజుకు కొంత మొత్తాన్ని వాళ్లకు ఇచ్చేవాడు. పోలీసుల తనిఖీలు.. దాడులుంటే వెంటనే సరిహద్దు దాటేసేలా ఈ చర్యలు చేపట్టాడు. దీంతో జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాల వారూ ఇక్కడకు వస్తుంటారు. జూదమాడే వారికి భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు. దాంతో అక్కడ రోజుకు రూ.ఐదారు లక్షల వరకు పేకాట జరుగుతోందని సమాచారం. ఇలా కొంత కాలంగా తమిళనాడు రాష్ట్రం పొన్నైలో జూదమాడుతుండగా తమిళనాడు డీఐజీ స్థాయి అధికారి దాడులు చేశారు. ఈ దాడిలో చిత్తూరుకు చెందిన ఎనిమిది మంది పట్టుబడగా.. నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారు అరక్కోణం జైలులో ఉన్నారు. ఇక, నిర్వాహకుడు కారును వదిలి పారిపోయాడు. దీంతో అతడి కారును పొన్నై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రూ.10 వడ్డీకి అప్పు ఇస్తారు!
పేకాట ఆడేటప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వారికి.. నిర్వాహకుడే వడ్డీకి డబ్బులిస్తాడని తెలిసింది. దీనికి నూటికి పది రూపాయల వడ్డీకి ఇవ్వడంతో పాటు ష్యూరిటీ కింద కార్లు, ఇంటి పత్రాలు, ఇళ్ల స్థలాలను పెట్టుకుంటాడని సమాచారం. తీసుకున్న మొత్తంతో పాటు వడ్డీని కలిపి ఇస్తే ష్యూరిటీ కింద పెట్టుకున్న ఆస్తిని తిరిగి ఇస్తాడు. నిర్ణీత సమయంలోపు ఇవ్వకపోతే పెట్టిన ఆస్తి పోయినట్లే. ఇలా చాలామంది ఆస్తులను పెట్టి పోగొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిర్వాహకుడిపై పీడీ యాక్టు నమోదుకు చర్యలు
ఈ పేకాట నిర్వాహకుడిపై జిల్లాలో అనేక నేరారోపణలున్నాయి. ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన పైస్థాయి అధికారి కారులో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళుతుండగా గంగాధరనెల్లూరు మండల పరిఽధిలో అటకాయించి ఆ డబ్బులు తీసుకెళ్లిపోయారు. ఆ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై జీడీ నెల్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కొంతకాలం తర్వాత రెండోసారి అదే అధికారి డబ్బులు తీసుకెళుతుండగా తన అనుచరులతో కలిసి ఆ వ్యక్తి మళ్లీ కారును ఆపి మారణాయుధాలు చూపించి డబ్బులు ఎత్తుకెళ్లాడు. దీంతో ఆ సంస్థ యాజమాన్యం ఆ అధికారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇక, చిత్తూరు రామ్‌నగర్‌కాలనీలోని ఓ వ్యాపారిని బెదిరించి రూ.30 లక్షలు తీసుకున్నాడు. వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుపై చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తమిళనాడుకు చెందిన ఓ క్వారీ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా పలు నేరారోపణలున్న పేకాట నిర్వాహకుడిపై పీడీయాక్టు నమోదు చేయడానికి అవసరమైన ఆధారాలను తమిళనాడు పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.