పీఎం సూర్యఘర్‌పై చిమ్మచీకట్లు
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:26 AM
ప్రకృతి వనరులతో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం జిల్లాలో ఆపసోపాలు పడుతోంది. సూర్యకాంతులతో సోలార్ పలకల నుంచి విద్యుత్ ఉత్పత్తికి పలు కారణాలు మబ్బుల్లా అడ్డుపడుతున్నాయి.
డిమాండుకు దీటుగా పెరగని పరికరాల ఉత్పత్తి
మందగమనంగా సాగుతున్న ఏర్పాటు ప్రక్రియ
ఆపసోపాలు పడుతున్న విద్యుత్ అధికారులు
ప్రకృతి వనరులతో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం జిల్లాలో ఆపసోపాలు పడుతోంది. సూర్యకాంతులతో సోలార్ పలకల నుంచి విద్యుత్ ఉత్పత్తికి పలు కారణాలు మబ్బుల్లా అడ్డుపడుతున్నాయి.
మదనపల్లె టౌన్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకానికి ప్రతి ఒక్కరూ అర్హులే. విద్యుత్ వినియోగదారులు ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ సామర్థ్యంతో ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో కిలోవాట్‌కు రూ.70వేల చొప్పున, 3కిలోవాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు రూ.2.10లక్షల దాకా ఖర్చు వస్తుంది. దీనికిగాను కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్‌కు రూ.30వేలు, 2 కిలోవాట్లకు రూ.60వేలు, మూడు కిలోవాట్లకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తుంది. మొదట వినియోగదారుడు పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే, ఎస్పీడీసీఎల్‌తో అగ్రిమెంట్ చేసుకున్న ప్రైవేటు సంస్థ ప్రతినిఽధులు వచ్చి వినియోగదారుడికి అన్నీ వివరిస్తారు. దీనికయ్యే మొత్తం (రూ.70వేలు, రూ.1.40లక్షలు, రూ.2.10లక్షలు) చెల్లించాకే ప్రైవేటు సంస్థ సోలార్ పరికరాలు తీసుకొచ్చి వినియోగదారుడి ఇంటిపై సోలార్ ప్లాంటు బిగిస్తారు. ఎస్పీడీసీఎల్ అధికారులు వచ్చి ఈ ప్లాంటును తనిఖీ చేసి, నెట్ మీటర్‌ను బిగించి, చార్జి చేస్తారు. తర్వాతనే వినియోగదారుడికి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.78వేలు ఖాతాలో పడతాయి. సుమారు రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టాలంటే సామాన్యుడు ఈ పథకం మాకొద్దు బాబోయ్ అంటున్నారు.
సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు
వినియోగదారుడి ఇంటి పైకప్పుపై బిగించిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నుంచి పగలు పూట ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి విక్రయించుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ.2.09 చెల్లిస్తారు. అలాగే ఎస్పీడీసీఎల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌కు స్లాబ్ రేటులో వినియోగదారుడికి బిల్లింగ్ ఇస్తారు. వినియోగదారుడు విక్రయించిన విద్యుత్ యూనిట్ల సొమ్ముకు, ఎస్పీడీసీఎల్ నుంచి వాడుకున్న విద్యుత్ బిల్లుకు మధ్య వ్యత్యాసం సొమ్మును మాత్రమే వినియోగదారుడు చెల్లించాలి. ఒక వేళ తక్కువగా వాడుతుంటే ఎస్పీడీసీఎల్ నుంచి వినియోగాదారుడికి గ్రిడ్‌కు సరఫరా చేసిన విద్యుత్ బిల్లును తిరిగి చెల్లిస్తారు.
అగ్రిమెంట్లకే సమయం వృథా
పీఎం సూర్యఘర్ పథకం గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో 12,237 సోలార్ ప్లాంట్లను బిగించడమే లక్ష్యంగా ఎస్పీడీసీఎల్ అధికారులు సాగారు. దీనికిగాను ఆరు ప్రైవేటు సంస్థలను టెండర్లకు అహ్వానించగా డిసెంబర్ నెల వరకు ఏ ఒక్క సంస్థా టెండరు దాఖలు చేయలేదు. దీంతో రీటెండర్లు పిలవగా ఐదు సంస్థలు టెండర్లు వేశాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను ఐదు కంపెనీలు టెండర్లు పాడుకుని సోలార్‌ప్లాంట్లు బిగిస్తున్నారు. కాగా, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో దేశంలో సోలార్ ప్యానెళ్ల తయారీ మందగించింది. దీనికితోడు స్ట్రక్చర్స్ తయారీ నెమ్మదించింది. అంతేకాకుండా జనవరి నుంచి దేశవ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకానికి ఆధరణ పెరగడంతో సోలార్ ప్యానెల్స్, ఇతర పరికరాలకు డిమాండ్ పెరిగింది. కానీ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో సమయం పూర్తిగా వృథా అయిపోయింది.
80 రోజుల్లో 10,655 ప్లాంట్లు అసాధ్యం
జనవరి నుంచి జూన్ 31వ తేదీలోపు జిల్లాలో 12,237 సోలార్ ప్లాంట్లను బిగించాలనే లక్ష్యాన్ని ఎస్పీడీసీఎల్ తీసుకుంది. పనులు ఓ మోస్తరుగా జరుగుతుండగా గ్యాస్ సంక్షోభం తలెత్తి సోలార్ ప్యానెళ్ల సరఫరా రెండు నెలలు నిలిచిపోయింది. ఈ క్రమంలో లక్ష్యం చేరుకోవడానికి మరో రెండు నెలలు పొడగించి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ ఆరు నెలల కాలంలో చూసుకుంటే 12,237 సోలార్ ప్లాంట్లకుగాను 2,653 సోలార్‌ప్లాంట్లకు ఆర్డర్ తీసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 1,582 మాత్రమే బిగించారు. ఇంకా 10,655 సోలార్ ప్లాంట్లను బిగించాల్సి ఉంది. కేవలం మిగిలిన 80 రోజుల గడువులో ఇన్ని వేల ప్లాంట్లు బిగించడం అసాధ్యమనే చెప్పవచ్చు.