Share News

బతికించండి.. చదువుకుంటా..

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:04 AM

నన్ను బతికించండి. బాగా చదువుకుంటా. ఉద్యోగం తెచ్చుకుంటా. కూలి పనులు చేసుకునే అమ్మ నాన్నలకు అండగా ఉంటా. అక్కకు పెళ్లి చేయడానికి నాన్నకు తోడుంటా. ఇన్నాళ్లు మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసిన అమ్మ నాన్నలను ఏ కష్టం లేకుండా చూసుకుంటా.

బతికించండి.. చదువుకుంటా..
కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్న మార్కండేయులు

కిడ్నీ ఫెయిలై ఆస్పత్రిపాలైన ఇంజనీరింగ్‌ విద్యార్థి

నన్ను బతికించండి. బాగా చదువుకుంటా. ఉద్యోగం తెచ్చుకుంటా. కూలి పనులు చేసుకునే అమ్మ నాన్నలకు అండగా ఉంటా. అక్కకు పెళ్లి చేయడానికి నాన్నకు తోడుంటా. ఇన్నాళ్లు మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసిన అమ్మ నాన్నలను ఏ కష్టం లేకుండా చూసుకుంటా.

ఇదీ ఒక కిడ్నీ ఫెయిలై.. మరొకటి బలహీనంగా మారి డయాలసిస్‌ చేసుకుంటున్న ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆకాంక్ష. బతుకు పోరాటం చేస్తున్న తనకు దాతలు అండగా నిలవాలంటూ 18 ఏళ్ల మార్కండేయులు చేసుకుంటున్న వేడుకోలు ఇది.

మార్కండేయులుది వి.కోట మండలం దానమయ్యగారిపల్లె. తల్లిదండ్రులు జ్యోతి, ఏకాంబరం. కుప్పం ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ కూలీలే. కష్టపడి కూలి పనులుచేసి బీటెక్‌ చదివిస్తున్నారు. చదువులో బాగా రాణిస్తున్న మార్కండేయులుకు.. జనవరిలో ఉన్నట్టుండి తీవ్రంగా జ్వరం వచ్చింది. వి.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో, తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లాలని ఆ వైద్యుడు సూచించారు. తల్లిదండ్రులు హుటాహుటిన స్విమ్స్‌కు తీసుకొస్తే వైద్యలు పరీక్షించి కిడ్నీ సమస్య ఉందని, డయాలసిస్‌ చేయాలని చెప్పారు. అక్కడే వారం రోజులు డయాలసిస్‌ చేయించారు. ఒక్కో వైద్యుడు ఒక్కో రకంగా చెప్పడంతో తిరుపతిలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒక కిడ్నీ పాడైందని, కిడ్నీ మార్పిడి చేయాలని అక్కడి వైద్యులు చెప్పారు. తాను కిడ్నీ ఇస్తానని, బిడ్డకు ఆపరేషన్‌ చేసి అమర్చాలని తల్లి జ్యోతి వేడుకున్నారు. కిడ్నీ ఉండి ఆపరేషన్‌ చేసేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, అది కూడా హైదరాబాద్‌, వేలూరు సీఎంసీ, విజయవాడల్లోని పెద్ద ఆస్పత్రుల్లోనే ఈ ఆపరేషన్‌ చేస్తారని వాళ్లు చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. కూలిపనులు చేసుకుంటూ జీవించే తాము రూ.20 లక్షలు అక్కడ్నుంచి తేవాలని కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే వైద్య ఖర్చులకు సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేసి చేయించామన్నారు. ఇక స్తోమత లేక చిత్తూరులోని వారి బంధువుల ఇంటి నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడు కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. రెండు రోజులకు ఒకసారి డయాలసిస్‌ జరుగుతోందని విద్యార్థి బంధువులు తెలిపారు.

దాతలూ.. ఆదుకోరూ

తనను బతికించాలని వేడుకుంటున్న తమ బిడ్డ మార్కండేయులకు వైద్యం కోసం దాతలు ఆపన్నహస్తం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు జ్యోతి, యూనియన్‌ బ్యాంకు అకౌంట్‌ నెంబరు 343402010506021కు లేదా 90526 02575 నెంబరుకు ఫోన్‌పే చేయాలని అభ్యర్థిస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం సతీమణి నారా భువనేశ్వరిని కలిసి తమ కొడుకును బతికించాలని వేడుకోనున్నట్లు వారు చెప్పారు.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 26 , 2026 | 02:04 AM