Share News

వద్దన్న సమయంలోనే క్రికెట్‌ ఆడుతున్నారు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:53 PM

వారం కిందట ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకును ఆడిపించడానికి చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలోకి వచ్చారు.

 వద్దన్న సమయంలోనే  క్రికెట్‌ ఆడుతున్నారు
మెసానికల్‌ మైదానంలో నిర్దేశిత సమయాల్లో క్రికెట్‌ ఆడకూడదని ఏర్పాటు చేసిన బోర్డు

వారం కిందట ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకును ఆడిపించడానికి చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలోకి వచ్చారు. పిల్లవాడు ఆడుకుంటుంటే గ్యాలరీలో కూర్చున్నారామె. మైదానంలో కొంత మంది యువకులు క్రికెట్‌ ఆడుతుండగా.. బంతి వేగంగా వచ్చి ఆమెకు తగిలింది. వెంటనే ఆమె పడిపోయారు. చుట్టుపక్కనున్న వాళ్లు గమనించి ఆమెకు నీరు తాగించి కూర్చో బెట్టారు. బంతి ఇంకాస్త వేగంగా తగిలుంటే ప్రాణాలే పోయేవి. ఆ బిడ్డకు తాకినా అదే జరిగేది.

పది రోజుల కిందట మరో మహిళ మెసానికల్‌ మైదానంలో వాకింగ్‌ చేస్తుంటే కొంత మంది యువకులు క్రికెట్‌ ఆడుతుండగా బంతి వేగంగా వచ్చి ఆమె వీపునకు తాకడంతో నొప్పిని భరించలేక కేకలు వేశారు. దీంతో వాకింగ్‌ చేస్తున్న వారు ఆ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు తిరగబడ్డారు. దీంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో ఉదయం, సాయంత్రం నగరవాసులు వాకింగ్‌ చేసుకుంటుంటారు. అదే సమయంలో యువకులు మైదానం నలుమూలల క్రికెట్‌ ఆడుతుండటంతో ఆ బంతి తరచూ వాకర్స్‌కు తగిలి గాయాలవుతున్నాయి. దీనిపై ఇటీవల కొంతమంది కలెక్టర్‌, డీఎ్‌సఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు క్రికెట్‌ ఆడడాన్ని నిషేధిస్తూ వారం కిందట మైదానంలో బోర్డులూ ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు మైదానం వెనకవైపున క్రికెట్‌ నెట్స్‌ ఉన్నాయని అక్కడ ఆడుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికలను యువకులు పాటించడం లేదు. బోర్డు పక్కనే క్రికెట్‌ ఆడుతుండటంతో వాకింగ్‌ చేసేవారు, చిన్నపిల్లలు ఆందోళన చెందుతున్నారు. వాకింగ్‌ చేస్తుంటే ఏ బంతి ఎటువైపు వచ్చి తాకుతుందోనని భయపడే పరిస్థితి. తాము చెబితే యువకులు తిరగబడుతున్నారని, డీఎ్‌సఏ అధికారులు పట్టించుకోవడం లేదని వాకర్లు వాపోతున్నారు.

- చిత్తూరు క్రీడలు, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 12 , 2026 | 11:53 PM