ఏఐతో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 01:15 AM
పర్యాటక దినోత్సవంలో జేసీ గోవిందరావు
తిరుచానూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఆదివారం రాత్రి శిల్పారామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో జిల్లాను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూశాఖ సహకారం అందిస్తుందన్నారు. అమరావతితో పాటు తిరుపతిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా కేంద్రప్రభుత్వం గుర్తించిందన్నారు. దీనికోసం రూ.500కోటు రానున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తిరుపతి నగరానికి అనేక స్టార్‌హోటళ్లు వచ్చాయని, మరిన్ని నూతన ప్రాజెక్టులు రానున్నాయని చెప్పారు. తిరుపతి, మెట్టుకండ్రిగ వద్ద రూ.18కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అలాగే వెంకటగిరి చీరల క్లస్టర్, మాధవరం ఉడ్ కార్వింగ్ ప్రాంతాలను టూరిస్టు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. తద్వారా స్థానిక స్వయం సహాయ సంఘాలు, చేతివృత్తుల వారు ఆర్ధికరంగా బలోపేతం అవుతారన్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీపడుతూ తిరుపతిని అన్నిరంగాల్లో కేంద్ర బిందువుగా మార్చేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలియజేశారు. ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల సహకారంతో జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకశాఖ ఆర్‌డీ రమణప్రసాద్, జిల్లా టూరిజం అఽధికారి జనార్దన రెడ్డి మాట్లాడుతూ.. టెంపుల్ టూరిజంతోపాటు అటవీశాఖ సహకారంతో ఏకోటూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువస్తోందన్నారు. అంతకు ముందు పర్యాటరంగానికి విశేషంగా కృషి చేసిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్ జయకృష్ణ, శిల్పారామం ఏవో ఖాదర్‌వలీ, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, నరసింహయాదవ్, పరసారత్నం తదితరులు పాల్గొన్నారు.