హమ్మయ్యా..! నామినేషన్లు ముగిశాయి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:45 AM
జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అటు అధికారులు, ఇటు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రెండు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే.
- తొలి రెండు రోజులు ఉద్రిక్తతలు..చివరి రోజు ప్రశాంతం
- పోలీసుల సహకారంతో వైసీపీ నామినేషన్లు
- కేంద్రాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ
అన్నమయ్య, అక్టోబర్ 23(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అటు అధికారులు, ఇటు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రెండు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే. టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడుల్లో పలువురు గాయాల పాలయ్యారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో చివరి రోజైన శుక్రవారం పోలీసులు, అధికారులు నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా జరిగింది. రక్షణ అడిగిన వైసీపీ అభ్యర్దులను పోలీసులే నామినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లి నామినేషన్లు వేయించారు.
భారీ భద్రత
జిల్లాలో గడిచిన రెండు రోజులు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో యంత్రాంగం శుక్రవారం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. నామినేషన్ కేంద్రానికి 500 అడుగుల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసింది. జనం గుంపులుగా చేరకుండా చూశారు. ముళ్లకంచె ఏర్పాటు చేశారు. గొడవలకు కారణమవుతారని భావించిన ఇరు పార్టీల నేతలను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. నామినేషన్ల రెండవ రోజు ఘర్షణలు జరిగిన తంబళ్లపల్లె, పీటీఎం మండలాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తప్ప టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ నామినేషన్ కేంద్రాల దరిదాపులకు రాకుండా చర్యలు తీసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలో నామినేషన్ కేంద్రం రోడ్డుపైన ఇనుపు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి, ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. జేసీ శివనారాయణశర్మ, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ఆర్డీవోలు, డీఎస్పీలు ఉదయం నుంచి నామినేషన్ గడువు ముగిసే వరకు కేంద్రాలను పర్యవేక్షించారు. ఎన్నికల పరిశీలకుడు బాలకృష్ణ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నామినేషన్ల సరళిని పరిశీలించారు.
వైసీపీ అభ్యర్థులకు ఫోన్‌చేసి పిలిచిన అధికారులు
బి.కొత్తకోట మండలంలో రెండు రోజులుగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలు చింపేశారు. అయితే శుక్రవారం రెవెన్యూ అధికారులు నామినేషన్లు వేయకుండా వెనుదిరిగిన వాళ్లకు ఫోన్ చేసి పిలిచి మరీ నామినేషన్లు వేయించారు. వాల్మీకిపురంలో తమను నామినేషన్లు వేయనీయడం లేదని వైసీపీ నేతలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు రక్షణగా ఉండి వారితో నామినేషన్లు వేయించారు. తంబళ్లపల్లెలో పోలీసులు వైసీపీ వాళ్లను వెంటపెట్టుకుని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. గాలివీడు మండలం పూలుకుంట ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి పోలీసుల సాయంతో నామినేషన్ వేశారు.
చౌడేపల్లెలో స్వల్ప ఉద్రిక్తత
చౌడేపల్లెలో నామినేషన్ వేయడానికి బీసీవై పార్టీకి చెందిన కొందరు నేతలు రావడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీసీవై అధినేత రామచంద్రయాదవ్ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి నామినేషన్లు వేయడానికి చర్యలు తీసుకున్నారు. నామినేషన్ కార్యాలయం ముందు పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు వందలాది మందిపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కుకున్నారు. గాయపడిన వ్యక్తులు అలాగే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లారు. గుర్రంకొండలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పుంగనూరు నియోజకవర్గం వైసీపీ నేత కిరణ్‌కు చెందిన కార్లను కూటమి నాయకులు ధ్వంసం చేశారు. ములకలచెరువు మండలంలో పోలీసులు వైసీపీ అభ్యర్థులను బందోబస్తు మధ్య నామినేషన్ కేంద్రానికి తీసుకురాగా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.
అధికారులు ప్రచారం చేసినా..
తమను నామినేషన్లు వేయనీకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశాంత్‌కుమార్ నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని సోషియల్ మీడియా వేదికగా కోరారు. టోల్‌ఫ్రీ నంబరు కూడా ప్రకటించారు. ఎస్పీ ధీరజ్ తన సిబ్బందితో ఇదే అంశాన్ని సోషియల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అయినా కొన్నిచోట్ల వైసీపీ నేతల నుంచి స్పందన కరువైంది.
చివరి రోజు పోటెత్తిన నామినేషన్లు
నామినేషన్ల చివరి రోజు శుక్రవారం జిల్లాలో భారీగా దాఖలయ్యాయి. మదనపల్లె మండలంలో 79 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో టీడీపీ 41, వైసీపీ 28, జనసేన 4, బీజేపీ 1. బీఎస్పీ 1, స్వతంత్రులు 4 ఉన్నాయి. ఇదే రీతిలో దాదాపు అన్ని మండలాల్లోనూ అన్ని పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, కలికిరి మండలంలో నామినేషన్ ముగిసే సమయానికి వైసీపీ తరఫున కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది. వైసీపీ పేరుతో టీడీపీ వాళ్లే కొన్ని నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది.