1936 వినాయక మండపాలకు అనుమతులు
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:37 AM
చిత్తూరు జిల్లాలో 1936 వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతి పొందారు. విగ్రహాలను ఎన్ని రోజులు ఉంచుతారో తెలియజేస్తూ అనుమతి పత్రాలను తీసుకున్నారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖల అనుమతులు ఒకేసారి ఉత్సవ కమిటీలకు అందాయి.
పరిశీలనలో మరో 531 దరఖాస్తులు
చిత్తూరు అర్బన్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1936 వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతి పొందారు. విగ్రహాలను ఎన్ని రోజులు ఉంచుతారో తెలియజేస్తూ అనుమతి పత్రాలను తీసుకున్నారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖల అనుమతులు ఒకేసారి ఉత్సవ కమిటీలకు అందాయి. ఆదివారం రాత్రికి పోలీసు స్టేషన్ల వారీగా 2692 వినాయక విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా.. 1936 ఆమోదించారు. మరో 531 దరఖాస్తులను రాత్రిలోగా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా లేని 180 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 45 పక్క జిల్లాలకు బదిలీ చేశారు. వందకు మించి మండపాలకు బంగారుపాళ్యం, కుప్పం, నగరి, పలమనేరు, తవణంపల్లె ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చారు. అత్యధికంగా పలమనేరులో 140.. అత్యల్పంగా రొంపిచెర్లలో 26 మండపాలకు అనుమతిచ్చారు.
పోలీసుల సూచనలు
మండపాల వద్ద సీసీ కెమెరాలను అమర్చాలి. విద్యుత్ లైనుకు దూరంగా ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక వాహనాలు, స్థానికులు వచ్చేందుకు వీలుగా దారి ఉండాలి. నిమజ్జన సమయంలో అతి భారీ శబ్ధాలు చేసే సౌండ్ సిస్టంను వాడకూడదు. రసాయనాలతో కూడిన రంగులు కాకుండా, కుంకుమ, పసుపు వంటివి చల్లుకోవాలి. మద్యం తాగి అల్లర్లు చేస్తే చర్యలు తీసుకుంటారు.
మట్టి విగ్రహాలనే పూజించాలి: ఎస్పీ
పర్యావరణ హిత మట్టి విగ్రహాలనే పూజించాలని ఎస్పీ తుషార్‌డూడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వే డుకలను.. నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, జరిగే అవకాశం ఉన్నా.. సంబంధిత పోలీసులకు, 112 నంబర్‌కు, పోలీసు వాట్సాప్ నంబర్ 94409 00005కు సమాచారం అందించాలని కోరారు. జిల్లా ప్రజలకు ఎస్పీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.