ప్రజా కవి యోగివేమన
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:51 AM
పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాలతో రచనలు చేసిన ప్రజాకవి యోగివేమన అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. యోగి వేమన జయంతి కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ఘనంగా జరిగింది.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాలతో రచనలు చేసిన ప్రజాకవి యోగివేమన అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. యోగి వేమన జయంతి కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటవెలదిలో సరళమైన రీతిలో అన్ని వర్గాల ప్రజల హృదయాలను హత్తుకునే రీతిలో వేమన పద్యరచన చేశారన్నారు. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశారని చెప్పారు. వేమన పద్యాలను ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోనూ అనువదించారని వివరించారు. ఐక్యరాజ్య సమితి యునెస్కో విభాగం ప్రపంచభాష కవుల్లో యోగివేమన ఒకరిగా గుర్తించినట్లు వివరించారు. డీఆర్వో మోహన్ కుమార్, జిల్లా పర్యాటక విభాగ అధికారి గౌరి, అట్లూరి శ్రీనివాసులు, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.